మళ్లీ అదే పాలన షురూ అయ్యింది. దేన్నైతే ప్రజలు తిరస్కరించారో, దేనికైతే విసిగెత్తిపోయారో.. అదే తంతు మళ్లీ మొదలైంది. కేసీఆర్ పాలన అంటే ఎందుకు జనాలకు విసుగొచ్చింది. తను చెప్పిందే వేదం.. తనకు తెలిసిందే పాలన అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపాడు. ఎవరి మాట ఖాతరు చేయలేదు. చెప్పినా వినలేదు. ఇక చెప్పడం చాలించుకుని భజనలు చేయడం మొదలుపెట్టారు. పరస్పర డబ్బా లాగా సాగింది పాలన. తను ఏ నిర్ణయం తీసుకున్నా.. అబ్బబ్బా తిరుగులేదు అనే ఆన్సరే రావాలె తప్ప.. దాన్ని ఎవరూ ఎదురించవద్దు. అంతే కాదు. ప్రచార యావకూడా అంతింత కాదయా అన్నట్టుగా ఉండేది.
మాట్లాడితే అహో ఓహోలు.. తెల్లారితో పాలాభిషేకాలు. ఇలాగైనా కేసీఆర్ దృష్టిలో పడితే అదే పదివేలనుకున్నారంతా. పేపర్లో ప్రకటనలకు కొదవలేదు. ఇక మన రాష్ట్రం పక్క రాష్ట్రం అని కాదు తన కీర్తి కండూతి వీరలెవల్‌కు వెళ్లిపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రకటనల రూపంలో వృధా చేశాడు కేసీఆర్. ఇప్పుడు అదే బాటలో సాగుతున్నది రేవంత్ సర్కార్. సర్కార్ ఏర్పడిన నాటి నుంచే మొదలైందీ ప్రచార పర్వం. ఏ సందర్భమూ వదలడం లేదు. మేము కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తున్నామని చెప్పుకోవడానికి, జనాలకు మరింత దగ్గర కావడానికి తహతహలాడుతున్నట్టున్నారు. కానీ, ఇప్పుడు జనం కేసీఆర్‌ను గురించి ఆలోచించడం లేదు.
కొత్త సర్కార్‌ను తెచ్చిపెట్టుకున్నాం మాకేమి చేయబోతుందా..? అని ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీలను నెమరువేరుసుకుంటున్నారు. రజినీకాంత్ సినిమాలో చెప్పినట్టు.. చేసింది గోరంత, చేయాల్సింది కొండంత ఉంది. అప్పుడే భాజభజంత్రీలతో డప్పుల వాయిద్యాలతో పాలాభిషేకాలతో ప్రచార హేళ ఏల… అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత పాలనలో నిత్యం జరిగే పాలాభిషేకాలకు జనం నవ్వుకుని ఇది పాలప్యాకెట్ల పాలన అనే దాకా వచ్చింది. లక్ష రుణమాఫీ చేయడం బాగానే ఉంది. సంబురాలెందుకు..? ఇంకా చేయాల్సింది ఉంది కదా. ఇప్పుడు చేసింది కూడా రేషన్ కార్డు ఉన్నవారికే. రేషన్‌కార్డు లేనివారికి రుణమాఫీ లేనట్టేనని అర్థమవుతూనే ఉన్నది.
ఇన్నాళ్లూ ఆపీ ఆపీ ఇప్పుడు చేస్తే రైతులు సంబరాలు చేసుకునేంత సంతోషంగా ఏమీ లేరు. దీనికి తోడు రైతుపెట్టుబడి సాయం అందలేదు. ఒకటి ఆపి ఒకటి ఇస్తున్నారని తెలిసిపోయింది. పెట్టుబడి సాయం చేసినా చేయకపోయినా వ్యవసాయం ఆగదు. అప్పుచేసైనా సరే సాగు నడుస్తుంది. అది తెలుసు సర్కార్‌కు.