దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌:

పోలీసులు డైరీలకెక్కుతున్నారు. ప్రతిపక్షంలో ఎవరున్నా టార్గెట్‌ పోలీసులే. అధికారంలో ఎవరుంటే వారు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే పోలీసులు. మరి ప్రతిపక్షాలకు టార్గెట్‌ కారా..? అవుతారు. అందుకే ఇలా పొలిటికల్‌గా వారిని జెండాకెక్కిస్తూ వార్నింగ్‌లు ఇవ్వడం …అదీ డైరీలో పేర్లు రాసుకుంటున్నాం.. బిడ్డా మీ సంగతి చూస్తామనే బెదిరింపులు కామన్‌ అయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొన్నటి వరకు రేవంత్‌రెడ్డి కూడా ఇలాగే బెదిరిస్తూ వచ్చారు. రెడ్  డైరీలో పోలీసుల పేర్లు రాసుకుంటున్నానని, అధికార పార్టీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ అక్రమకేసులు పెడుతున్నారని, మీ సంగతి అధికారంలోకి రాగానే చూస్తామని బెదిరించారు రేవంత్‌.

ఇప్పుడు కేటీఆర్‌ వంతైంది. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చేస్తున్న నిరసనలో వారిపై లాఠీచార్జి, దాడులు చేయడాన్ని కేటీఆర్‌ తీవ్రంగా ఆక్షేపించారు. డైరీలో పోలీసుల పేర్లు రాసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. గురవారం హైదరాబాద్‌లో టీఆరెస్వీ విద్యార్థి నాయకులతో కేటీఆర్‌ సమావేశం నిర్వహించి పోలీసులకు ఈ వార్నింగ్‌ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఈ పోలీసులు అంతు చూస్తామనే విధంగా వారిని వదిలిపెట్టబోమని ఘాటుగా స్పదించారాయన.

మొన్నటికి మొన్న ఆంధ్రలో కూడా ఈ డైరీల ట్రెండింగే నడిచింది. లోకేశ్‌ కూడా ఓ డైరీ చేతబట్టుకుని పోలీసుల పేర్లు రాసుకున్నానని , వారి సంగతి చెప్తానన్నాడు. ఇప్పుడు అదే పనిలో ఉండి ఉంటాడు.

దీన్ని స్పూర్తిగా తీసుకున్నాడేమో కౌశిక్‌రెడ్డి కూడా ఓ బ్లాక్‌ డైరీ పట్టుకుని ప్రెస్‌మీట్‌ ఒకటి పెట్టి.. దీంట్లో రాసుకుంటున్నా.. మీ సంగతి చూస్తానన్నాడు. ఇప్పుడు ఈ డైరీ కేటీఆర్‌ దాకా వచ్చింది. ఆయనా ఓ డైరీ కొనుక్కున్నట్టున్నాడు. ఇక రాయడం మొదలు పెట్టి ఉంటాడు. మొత్తానికి డైరీ రాసే అలవాటు ఎప్పుడో మరిచారు. ఇలా రాజకీయ నేతలకు మాత్రం ఈ డైరీ ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. డైరీలో రాయడమంటే ఇప్పుడు దానికోలెక్కుంటదన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed