దండుగుల శ్రీనివాస్ – వాస్తవం బ్యూరో చీఫ్:
ఇద్దరు గౌండ్లు పీసీసీ చీఫ్ కోసం పోటాపోటీగా తలపడ్డారు. అధిష్టానం వద్ద ఎవరి బలాలేందో చూపించుకున్నారు. లాబీయింగ్‌లో ఒకరికి మరొకరు తీసిపోరనే విధంగా తలపడ్డారు. ఒకరేమో టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్ మధయాష్కీ. మరొకరేమో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్. చివరకు అధిష్టానం మహేశ్‌కుమార్ గౌడ్ వైపే నిలిచింది.
కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా మధుయాష్కీకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని పట్టుబట్టారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కూడా మధుయాష్కీకి ఓ పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఓడిన నేతలకు పదవులివ్వొద్దనే అధిష్టానం నియమం మధుయాష్కీకి గుదిబండలా మారింది. ఇది కూడా పీసీసీ చీఫ్‌కు అడ్డుతగిలింది. మరి మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ ఉంది కదా… మరో పదవి ఎందుకు..? అని కూడా పార్టీ సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
కానీ మహేశ్ లాబీయింగ్ అక్కడ బాగా పనిచేసింది. ఎట్టకేలకు మహేశ్‌కుమార్ గౌడ్‌కు పీసీసీ చీఫ్ ఖాయంగా దక్కనుంది. ఇద్దరు గౌడ్ల పదవి లాబీయింగ్‌లో మహేశ్‌దే పై చేయిగా నిలిచింది. ఎస్టీకి మంత్రి పదవిలో చాన్స్ లేనందున పీసీసీ చీఫ్ ఇస్తారనే ప్రచారమూ జరిగింది. బలరాం నాయక్ పేరు ప్రధానంగా వినిపించింది. కానీ చివరకు పీసీసీ చీఫ్‌గా నియమించేందుకు అధిష్టానం మహేశ్‌కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది.