దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌:

ఆర్మూర్‌ రాజకీయాలు మారనున్నాయి. అక్కడి నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్‌, ప్రస్తుత మినరల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ నజర్‌ పెట్టాడు. తన రాజకీయ యుద్ధ క్షేత్రం బాల్కొండను వదిలి ఆర్మూర్‌ ఎంచుకున్నాడు. ఇక అక్కడే మకాం వేయనున్నారు. సొంతంగా ఇంటి నిర్మాణం, ఆఫీసు ఏర్పాటు తదితర ఏర్పాట్లకు అన్నీ సిద్దమవుతున్నాయి. ఇటీవలే ఆయన రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగే నాయకుల్లో ఈరవత్రి అనిల్ ఒకడు. బాల్కొండ నుంచి పోటీకి త్యాగం చేశాడు అనిల్.

అప్పటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో తనను కాదని, ముత్యాల సునీల్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చినా ఓకే చెప్పాడు. ప్రభుత్వం అధికారంలోకి రావడమే పరమావధిగా రేవంత్‌కు తనవంతుగా అన్నిరకాల అండదండలు అందించాడు అనిల్. ఇప్పుడు రాజకీయ భవిష్యత్‌ కోసం తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న వినయ్‌రెడ్డి అరచకాలు పెచ్చుమీరాయి. అక్కడ ఏ అధికారి రావాలన్నా వినయకు కప్పం కట్టాల్సిందే.

తాజాగా భీమ్‌గల్‌ సీఐ విషయంలో వివాదం సీఎం రేవంత్‌రెడ్డి దాకా వెళ్లింది. వినయ్‌ ఆ సీఐ వద్ద పదిహేను లక్షల వరకు వసూలు చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీపీ దీన్ని ఆపేశాడు. దీంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకున్నది. ఇప్పుడు ఈరవత్రి ఎంట్రీతో వినయ్‌రెడ్డి రాజకీయ భవిష్యత్ అంధకారమే కానుంది. ఇక ఇక్కడ నుంచి ఈరవిత్రి అనిల్‌ శకం మొదలుకానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed