దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: కొడుకు కోసం ఏమైనా చేస్తాం.. తప్పేముంది అన్నాడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి. కానీ ఈ సూత్రం ఇద్దరి కొడుకులకు వర్తించలేదు. ఒక చిన్న కొడుకు విషయంలోనే తలొగ్గాడు పోచారం. అన్నింటినీ భరించాడు. లక్ష్మీపుత్రుడు అన్న నోళ్లే లంగ పుత్రుడు అన్న భరించాడు. ఎవరి కోసం..? కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం. ఏ కొడుకు..? చిన్న కొడుకు. భాస్కర్‌రెడ్డి. మరి పెద్ద కొడుకు సురేందర్‌రెడ్డి పరిస్థితి. ఆలోచించలేదు. ఆలోచించేందుకు అక్కడ స్పేస్‌లేదు. చిన్నకొడుకు మొత్తం ఆ స్పేస్‌ను తీసేసుకున్నాడు.

అందుకే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పెద్ద కొడుకు పోచారం సురేందర్‌రెడ్డి ఇక రాజకీయాలకు దూరం కానున్నాడు. తండ్రి నిస్సహాయ పరిస్థితిని ఆ పెద్ద కొడుకు అర్థం చేసుకున్నాడు. తమ్ముడు రాజకీయ భవిష్యత్తు కోసం తన పొలిటికల్ కెరీర్‌ను పణంగా పెట్టేందుకు సిద్దపడ్డాడు. బీఆరెస్‌లో ఉన్నప్పుడు కొడుకులిద్దరికీ సమ ప్రాధాన్యతనిచ్చాడు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. బాన్సువాడ నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేశాడు. చెరో ముక్క పంచి ఇచ్చాడు. ఇద్దరూ రాజ్యమేలారు. ఇకపై అది చెల్లుబాటు కాదు. ఆ నాటి రోజులిప్పుడు లేవు.

కాంగ్రెస్‌లో చేరారు. తమ్ముడు భాస్కర్ రెడ్డికి నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఇక తనకేం పని ఇక్కడ…? అందుకే మెల్లగా తెరమరుగై పోయేందుకు డిసైడ్ అయ్యాడు. కార్యకర్తలకు కనుమరుగైపోయేందుకు కష్టమైన కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఈ లెక్కన రెండు ‘సన్’ స్ట్రోక్‌లు. ఒకటి ఇంత ఏజ్‌ వచ్చిన తరువాత చిన్న కొడుకు భాస్కర్‌రెడ్డి కోసం పార్టీ మారి అందరి చేత తిట్లు తినడం, పెద్ద కొడుకు లైఫ్‌ను ఏమీ చేయలేక గాలికి వదలేయడం.