దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌:

జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు జడ్పీ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావులో కొత్త ఆశలకు తెరలేపింది. తన వారసుడిని ఎమ్మెల్యే చేయాలనే కోరిక బలీయంగా ఉన్నా.. నాడు పరిస్థితులు ఆయనకు అనుకూలించలేదు. ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి తన కొడుకు దాదాన్నగారి సందీప్‌రావుకు అవకాశం ఇవ్వాలని పలుమార్లు ప్రయతనం చేసినా .. కేసీఆర్‌ సిట్టింగులకే అవకాశం ఇచ్చాడు. దీంతో జీవన్‌రెడ్డే పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

తాజాగా కేసీఆర్‌ జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ… పార్టీ నుంచి ఎవరు వెళ్లినా జడ్పీ చైర్మన్లు అలాగే ఉండాలని, వారికి మున్ముందు మంచి అవకాశాలు కల్పిస్తామని మాటిచ్చారు.

దీంతో ఈసారైనా తన వారసుడికి అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకుని ఆర్మూర్‌ నియోజకవర్గ టికెట్‌ కొట్టేద్దామని దాదాన్నగారి ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా త్వరలో పార్టీ పదవి ఒకటి దాదాన్నగారి సందీప్‌రావుకు ఇప్పించుకునే విధంగా చక్రం తిప్పుతున్నాడు. ఆ తరువాత నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేసే విధంగా చేసి .. అధినేతతో తన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలనేది విఠల్‌రావు వ్యూహం.

అందుకే ఆయన తన కొడుకును కూడా ప్రత్యేకంగా కేసీఆర్‌తో కలిపించాడు. ఇప్పటికే కొడుకు విషయాన్ని కేసీఆర్‌తో చెప్పి ఉన్నాడు విఠల్‌ రావు. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో మార్పులు చేర్పులు అనివార్యంగా భావిస్తున్నారు. నియోజకవర్గం పై పట్టుసాధించి తమ ఉనికి బలంగా ఉందని చాటుకుంటే చాలు ఆర్మూర్‌లో టికెట మాకే అనే ధీమాతో తండ్రీ కొడుకులు ఇద్దరూ మంచి ప్రణాళికతో ఉన్నారని తెలిసింది.

 

You missed