దండుగుల శ్రీనివాస్ – వాస్తవం బ్యూరో చీఫ్:
పొద్దున్నే ఓ పెద్దాయన ఫోన్ చేశాడు. బీఆరెస్ పార్టీ సీనియర్ లీడర్ అతను. సమకాలనీ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఆకస్మాత్తుగా మూడు చేపల కథను వినిపించాడయన. ఈ చేసల కథ ఇప్పుడెందుకు చెబుతున్నాడా.? అని అనుకున్న. ‘ ఇప్పుడు ఈ మూడు చేపల కథ సరిగ్గా నేటి రాజకీయాలకు సరిపోతాయ’న్నాడు. ఎలా..? మనసులోని నా డౌట్‌ను పసిగట్టిన ఆయన చెబితా విను అని మొదలుపెట్టాడు.
‘చిన్నప్పుడెప్పుడో మూడు చేపల కథ చదువుకున్నాం.. ఇప్పుడు ఆ చేపల కథలాగే ఉంది బీఆరెస్ పార్టీ లీడర్ల పరిస్థితి’
‘ఆ కథలో సమతి, కాలమతి, మందమతి అని మూడు చేపలుంటాయి…’ మొదలుపెట్టాడు.
అయినా ఈ అసందర్బ టాపిక్ ఎందుకో అర్థం కాలేదు. మళ్లీ చెప్పనారంభించాడు. నాకు చాన్స్ ఇవ్వకుండా
‘ ఇందులో సుమతి అనే చేప చాలా తెలివికల్లది. ఎండాకాలం సమీపిస్తున్న కొద్దీ ఇక తాము జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చింది అని గ్రహించింది’ ఆ విషయం మిగిలిన రెండు చేపలకు చెప్పింది. కానీ అవి వినలేదు.దీంతో ఓ ఉదయం సుమతి అనే చాప మెల్లగా నీరు బాగా ఉన్న మరో తటాకంలోకి ఈదుకుంటూ వెళ్లిపోయింది’
‘ఈ సుమతి చేపలాంటి వాళ్లే బీఆరెస్ నుంచి బీజేపీలోకి చేరే తెలివికల్లవాళ్లు ..’ మెల్లగా అసలు విషయానికొచ్చాడు.
వింటూ ఉన్నాను. ఊ కొడుతూ.
‘ ఇక మిగిలిన రెండో చేప కాలమతి. అది సుమతి జంప్ కాగానే మేల్కోలేదు. కాస్త సమయం పట్టింది. ఏం ఆలోంచించుకోలేకపోతున్నది..’
‘ఆ రెండు చేపలు ఉన్న నీళ్లు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. ఓ రోజు మందమతితో డిస్కస్ చేసింది కాలమతి’
‘ఏయ్ మందమతి నీళ్లు బాగా తగ్గాయ్.. ఇప్పుడెలా..? సుమతి ఓ తటాకంలోకి వెళ్లింది. అప్పుడు అక్కడికి వెళ్లాలంటే మనకు కష్టం. కనీసం ఈ పక్క ఉన్న మరో తటాకంలోకి వెళ్దాం. కొద్ది రోజులు ప్రాణాలు కాపాడుకోవచ్చు…’ అన్నది.
‘మందమతి మట్టిబుర్రకు తట్టలేదు. ఊకోవోయ్ కాలమతి.. అంత దిగులేలా..? ఎందుకంత టెన్షన్ పడుతున్నావ్..? ఇప్పటికైతే నీళ్లు బతకడానికి ఉన్నాయి కదా.. మళ్లీ వర్షాలు రాకపోవా..? అని లైట్‌గా తీసుకున్నది’
‘ ఇక లాభం లేదనుకుని కాలమతి పక్కనే ఉన్న మరో తటాకంలోకి తుర్రున ఈదుకుంటూ పలాయనవాదం చిత్తగించించింది…’
చెప్పడం ఆపాడు.
దీనికి ఏం వివరణ ఇస్తాడో.. ఆ తాత్పర్యమేమిటో అర్థంకాక అలా వింటూ ఉన్నాడు. చెప్తున్నాడు.
‘ఈ కాలమతి పోయిన చెరువు పేరు కాంగ్రెస్. అప్పటికప్పుడు ప్రాణాలు నిలుపుకోవాలంటే దానికి దగ్గరగా ఉన్న దాన్ని సమయానుకూలంగా ఎంచుకుని జంప్ అయ్యింది…’
అర్థం అయ్యింది.
‘ఇక మందమతి సంగతి తెలిసిందే కదా.. నీళ్లు మరీ దగ్గర పడటంతో జాలరి వచ్చి పట్టుకుని పోయి కూరొండుకుని తిన్నాడు..’ ముగించాడు.
‘బీజేపీలోకి పోయినోడు తెలివికళ్లోడు. కాంగ్రెస్‌లోకి పోయినోడూ ఆ సమయంలో బతికి బట్టకడతాడు… నాట్ బ్యాడ్. కానీ బీఆరెస్‌లోనే ఉంటే వాడి పరిస్థితి మందమతి గతే….’
మూడు చేపల కథ సారాంశాన్ని ఇలా సమకాలీన రాజకీయాలకు జోడించి తన భాష్యం, జోస్యం చెప్పాడా బీఆరెస్ సీనియర్ నేత.
Dandugula Srinivas
Senior journalist
8096677451