దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

కవిత అంటే ఒక్కప్పుడు షాడో సీఎం. ఇందూరుకు సీఎంలాంటి లీడర్‌. సీఎం కేసీఆర్‌ కూతురంటే ఓ మర్యాద. ఓ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌. ఏదో తెలియని అతీతమైన శక్తిగల నాయకురాలనే భావన. ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు ఆమె జైలుకు వెళ్లి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ వంద రోజుల్లో ఎన్నో మార్పులు. మరెన్నో షాకింగ్‌ న్యూస్‌లు. బ్రేకింగ్‌ న్యూస్‌లు. అప్పటి దాకా వీర విధేయత నటించి, మెప్పించిన నేతలంతా పోలోమంటు జంప్‌ అయ్యారు. అవకాశవాద రాజకీయాల జెండా ఎత్తారు. అధికారం లేనిదే ఒక్క క్షణం కూడా మేముండలేమంటూ కాడెత్తేశారు. అప్పటిదాకా అనుభవించిన పదవుల పరిహారం కూడా యాది చేసుకోలేదు.

గతం తోడుకుంటే వచ్చేదేముంది..? ప్రస్తుతం ఏంటీ మాకు లాభం అనే లాభాపేక్ష బేరీజు వేసుకునే లీడర్లంతా ఆ గట్టున చేరారు. కవిత లేకపోవడంతో ఇందూరు జిల్లా బీఆరెస్‌ మొత్తం ఆగమమయ్యింది. అర్వింద్‌ సునాయస గెలుపులో ఇదీ ఓ కీలక కారణమే. నేతలంతా తలోదిక్కు చూస్తున్నారు. అక్కడ స్పేస్‌ లేదు.. పోయినా పట్టించుకోరు అనుకునేవాళ్లు మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా తమ దారి తాము చూసుకున్నారు. తెలంగాణ జాగృతి చెల్లాచెదురయ్యింది. అక్క లేదు.. అన్నా లేడు.. బాపు కూడా లేడు.. అని డిసైడ్‌ అయ్యారు. తమ బతుకుదెరువు ఇందులో లేదని మాత్రం గ్గాట్టిగా ఫిక్స్‌ అయ్యారు.

ఎంతలో ఎంత మార్పు. ఒకప్పుడు ఇందూరు జిల్లా బీఆరెస్‌కు కంచుకోట. చావైనా రేవైనా ఇక్కడే అని కవిత ప్రకటించి.. అర్వింద్‌ను మట్టికరిపిస్తా అని చాలెంజ్‌ విసిరి ఎన్నో రోజులు కాలేదు. ఇంతలో కాలం ఎలా మారింది..? ఆమె జైలులో వంద రోజులు గడిపింది. ఇంకా ఎన్ని రోజులుంటుందో తెలియదు. ఫామ్‌ హౌజ్‌ కే కేసీఆర్‌ పరిమితమయ్యాడు. కేటీఆర్‌ దిక్కులు చూస్తూ ఎవరికీ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పార్టీ ఎప్పుడు లేవాలే..! ఇదంతా స్వయంకృతాపరాధం కాదా..?

You missed