దండుగుల శ్రీనివాస్ – వాస్తవం చీఫ్ బ్యూరో:
ఏనుగు రవీందర్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టాడు. పార్టీని, ప్రభుత్వాన్ని బలపర్చేందుకు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన తరువాత కూడా ఏనుగు రవీందర్‌రెడ్డి బలప్రదర్శన చేయడం రేవంత్‌కు గిట్టలేదు. దీనికి తోడు ఇప్పటికే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు ఏనుగు రవీందర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తమకు అన్ని విషయాల్లో అడ్గుతగులుతున్నాడని చెప్పుకొచ్చారు. పార్టీకి వస్తే ఏం కావాలన్నా చేసి పెడతానని ముందే రేవంత్ .. పోచారానికి హామీ ఇచ్చి ఉన్నాడు. దీంతో ఏనుగుపై తొలి ఎఫెక్ట్ పడనుంది. అతన్ని ఆ నియోజవకర్గం నుంచి తొలగించేందుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోనున్నాడు.
దీనికి సంబంధించిన క్లారిటీ మరికొద్ది రోజుల్లోనే వెలువడనున్నది. ఏనుగు రవీందర్‌రెడ్డి బాన్సువాడలో స్ట్రాంగ్ అవుతూ వచ్చాడు. అక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకుంటున్నాడు. బాన్సువాడ నియోజకవర్గంలో కీలకమైన ఇసుక మాఫియాను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. కీలక ఆదాయ వనరు దెబ్బతినడంతో తన అనుచరగణాన్నంతా లాక్కుపోవడం పోచారం శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి మింగుడు పడలేదు. దీంతో పాటు నియోజవర్గంలో పెండింగ్ బిల్స్ పేరుకుపోయాయి. డబుల్ బెడ్ రూం బిల్లులు, ఎత్తిపోతల పథకాల పనులు ఆగిపోయాయి. ఇక బీఆరెస్‌లో ఉంటే పరిస్థితి మరింత దారుణయ్యేలా ఉందని పోచారం గ్రహించాడు.
సర్వ రోగ నివారణిలా కాంగ్రెస్‌లో చేరడమే ఏకైక మార్గమని తలచాడు. అదే చేశాడు. ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. ఇటు స్వకార్యం అటు స్వామికార్యం రెండూ నెరవేరనున్నాయి పోచారం టీమ్‌కు.