దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

రేవంత్‌ సర్కార్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా నియమించనుంది. పోచారం తనయుడికి నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు అప్పగించనున్నది. కాంగ్రెస్‌ పార్టీలో చేరగానే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించారు. వ్యవసాయ శాఖ కూడా ఇస్తామని ప్రచారం జరిగింది. కానీ పోచారం కు మంత్రి పదవి ఇవ్వడం లేదు.

వయసురీత్యా, అనుభవ రీత్యా ఆయన సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చి సెక్రటేరియట్‌లో ఆయనకు ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేయించాలని రేవంత్‌ నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం పోచారం శ్రీనివాస్‌రెడ్డిని వెంటబెట్టుకుని రేవంత్‌ ఢిల్లీ వెళ్లనున్నాడు. అక్కడ సోనియా, రాహుల్‌గాంధీలకు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పరిచయం చేయనున్నాడు. పార్టీలో చేరినందుకు గాను భాస్కర్‌రెడ్డికి ఏదైనా కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇవ్వాలని రేవంత్‌ ఆఫర్‌ ఇచ్చాడు. కానీ దీన్ని పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిరస్కరించనట్టు తెలిసింది.

కొడుకు పదవి కోసమే తాను పార్టీలోకి వచ్చినట్టు సంకేతాలు వెళ్తాయని, ఇది తన రాజకీయ జీవితానికి ఇబ్బందిగా ఉంటుందని ఆయన భావించినట్టు సమాచారం. దీంతో పోచారం శ్రీనివాస్‌రెడ్డికే ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చేందుకు రేవంత్‌ నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. కాగా భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చే విషయంలో కూడా రేవంత్‌ క్లారిటీ ఇచ్చాడు. రానున్న రోజుల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భాస్కర్‌రెడ్డే పోటీ చేస్తాడని సీఎం మాటిచ్చాడు.

You missed