దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌:

మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను అర్బన్‌ రాజకీయం నుంచి దూరం చేసేందుకు సీఎం రేవంత్‌ ఎత్తులు వేస్తున్నాడు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కు, సీఎం రేవంత్‌ రెడ్డికి మధ్య చాలా గ్యాప్‌ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి టికెట్ కోసం మహేశ్‌ తీవ్ర ప్రయత్నాలు చేశాడు. కానీ కామారెడ్డి నుంచి రేవంత్‌ పోటీకి దిగేందుకు సిద్దమై షబ్బీర్‌ను నిజామాబాద్ అర్బన్‌కు పంపాడు. షబ్బీర్‌ను నిజామాబాద్‌కు పంపాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడు కూడా మహేశ్‌కు చెక్‌ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు రేవంత్‌.

తాజాగా నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంపై మహేశ్‌ పట్టు పెరగకుండా చూసేందుకు రేవంత్‌ .. షబ్బీర్‌ను పావుగా వాడుకుంటున్నాడు. కామారెడ్డిలో తన పార్టీ కార్యకలాపాలు చూసుకోవాల్సిన షబ్బీర్‌ను అర్బన్‌కు ఎగదోశాడు. ఇక్కడో క్యాంపు ఆఫీసును కూడా ఏర్పాటు చేయించాడు. గతంలో మధుయాష్కీ నివాసాన్నే షబ్బీర్‌ తన అర్బన్‌ క్యాంపు ఆఫీసుగా ఏర్పాటు చేయించుకున్నాడు. ఎవరైనా ఇక్కడికి వచ్చి కలవొచ్చంటూ అర్బన్‌ జనాలను, పార్టీ క్యాడర్‌ను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇది చాలదంటూ ఏకంగా కలెక్టర్‌తో, అధికారులతో రివ్యూలతు చేయడం కూడా మొదలు పెట్టాడు.

ఎమ్మెల్సీ హోదాలో మహేశ్‌ ఇప్పటికే చాలా మీటింగులకు హాజరయ్యాడు. కానీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా తను చాలా బిజీ. రేవంత్‌తో ఇక్కడ పొసగకున్నా ఢిల్లీ పెద్దలతో మహేశ్‌కు సత్సంబంధాలున్నాయి. ఈ పరిచయాలతోనే రేవంత్‌ను కాదని ఎమ్మెల్సీ తెచ్చుకోగలిగాడు మహేశ్‌. ఇప్పుడు పీసీసీ చీఫ్‌ పోస్టు కూడా ఆశిస్తున్నాడు. గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. తనకు కొరకరాని కొయ్యగా మారుతాడా అనే భయంలో సీఎం రేవంత్‌ ఉన్నాడు. గతంలో ఇక్కడ డీఎస్‌ను తొక్కిపెట్టేందుకు రాజశేఖర్‌రెడ్డి అసమ్మతి వర్గాన్ని ఎగదోసినట్టుగానే రేవంత్‌ కూడా మహేశ్‌పై అసమ్మతిని ఎగదోస్తున్నాడు.

ఏదో రాజకీయ సమీకరణల నేపథ్యంలో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేసినంత మాత్రాన ఇక్కడ పెద్దరికం ఏందిబై అని మహేశ్‌ వర్గం ప్రశ్నిస్తుండగా.. అసలు అర్బన్‌ లో నియోజకవర్గ ఇంచార్జి ఎవరు అనే ప్రశ్న మిగిలిన క్యాడర్‌ను వేధిస్తోంది. కాంగ్రెస్‌ గ్రూపు రాజకీయాలకు నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. ఇది మున్ముందు ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది.

 

You missed