దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు. ఒకరు ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి. మరొకరు నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ. మరో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈ నియోజకవర్గాల నుంచే పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు. ఒకరు వినయ్‌రెడ్డి. మరొకరు షబ్బీర్‌ అలీ. వీరిద్దరికీ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు. ఓడిపోయినా ఇద్దరూ ఎలా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారో చూడండంటూ ఏకిపారేశారు. వార్నింగ్‌లు ఇచ్చారు. ఇప్పడిది జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అసలేం జరిగింది…! షబ్బీర్‌ అలీ ఇక్కడ అర్బన్‌ నుంచి పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే.

వాస్తవానికి ఆయనకు జిల్లాతో సంబంధం లేదు. అప్పుడేదో రాజకీయ సమీకరణల నడుమ కామారెడ్డి కాకుండా అర్బన్‌కు రావాల్సిన గత్యంతరం ఏర్పడింది. అయినా ఓడాడు. ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చి కాంగ్రెస అధిష్టానం ఆయన సీనియారిటీకి మర్యాదిచ్చింది. అక్కడ కామారెడ్డిని వదిలేసి ఆయన ఎంచక్కా అర్బన్‌కు వచ్చి అధికారులతో ఇక్కడ మీటింగు పెట్టాడు. నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా..! అన్నట్టు అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఒక్కసారిగా కస్సున లేచాడు షబ్బీర్‌ పైకి. ఇదేం మర్యాద, ఇదెక్కడి నీతి.. నీవు ఏ హోదాలో వచ్చి ఇక్కడ కలెక్టర్‌తో కలిసి మీటింగులు పెడతావు..? నేను ఎమ్మెల్యేను ఇక్కడ ఉండగా.. నాకు ఆహ్వానం లేకుండా ఇవేం మీటింగులు.. అంటూ కడిగి పారేశాడు.

దీంతో ఇప్పుడిది చర్చై కూర్చుంది. ఇదిలా ఉంటే అక్కడ ఆర్మూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి కూడా వినయ్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యాడు. వినయ్‌రెడ్డి అక్కడ షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏకంగా అధికారుల పోస్టింగులకు డబ్బులు తీసుకుని ఆర్మూర్‌కు రప్పిస్తున్నాడనేది ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణ. నిన్న ప్రెస్‌మీట్‌లోనే ఇదే విషయాన్ని బాహాటంగానే చెప్పుకొచ్చాడు. అధికారులకు వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ అవినీతికి ఆస్కారం లేదు… ఎవరో చెప్పిన మాటలు విని.. వారికి డబ్బులు సమర్పించి ఇక్కడికి వస్తే మళ్లీ పెట్టాబేడా పట్టుకుని పారిపోవాల్సిందేనని గయ్యుమన్నాడు.

అంటే వినయ్‌రెడ్డి పోలీసు ఆఫీసర్ల దగ్గర, అధికారుల దగ్గర పోస్టింగుల కోసం పైసలు వసూలు చేస్తున్నాడనేది ఎమ్మెల్యే ఆరోపణ. వినయ్‌రెడ్డి అధికారం ఇక్కడ చెల్లుబాటు కాదని చెప్పకనే చెప్పాడు ఎమ్మెల్యే పోలీసులకు, అధికారులకు.

You missed