దండుగుల శ్రీనివాస్‌ – తెలంగాణ బ్యూరో

మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యమయ్యేలా ఉంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. కానీ పంద్రాగస్టు తరువాత గానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు. కొందరు కీలక నేతలను పార్టీలోకి లాగడానికి అధిష్టానం తీవ్ర కసరత్తులు చేస్తున్నది. ఇందులో భాగంగా కొందరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. దీంతో ఇది మరింత జాప్యమయ్యేలా ఉంది.

నిజామాబాద్‌ జిల్లాకు మంత్రి పదవి కేటాయించలేదు. ఇక్కడ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి దాదాపు మంత్రి పదవి ఖాయమని మొదటి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. హోం శాఖ కూడా ఆయనకే కేటాయిస్తారనే ఊహాగానాలూ ఉన్నాయి. ఈసారికే ఆయన చివరి పాలిటిక్స్‌… ఇక రిటైర్‌మెంటే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా పెద్ద మనిషికి మంత్రి పదవి వరిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. సీఎం రేవంత్‌కు సుదర్శన్‌రెడ్డి బంధువు కూడా. దీంతో ఈయననకు కాదని ఇక వేరే సమీరణలు ఉండవని ప్రచారం చేసుకుంటున్నారు.

అయితే అనూహ్యంగా తెరపైకి జిల్లాకు చెందిన బీఆరెస్‌ మాజీ మంత్రి ఒకరు వచ్చి పడ్డారు. ఆయన్ను పార్టీలోకి లాగడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రి శ్రీధర్‌ బాబులు ట్రై చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. మంత్రి పదవి ఇచ్చి.. కీలకమైన శాఖ కూడా అప్పగిస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం జరుగుతున్నదని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జెండా ఎగురవేసే భాగ్యం మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి దక్కలేదు. ఆ లోపే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు ఆయన అనుచరవర్గం నుంచి వచ్చాయి.

కానీ కోడ్‌ నేపథ్యంలో కలెక్టర్‌ చేతనే ఈ కార్యక్రమాన్ని జరిపించేశారు. పంద్రాగస్టులోగా మంత్రి వర్గ విస్తరణ జరిగి, తనకు మంత్రి పదవి దక్కితే తానే జెండా ఎగురవేసే వాడు. కానీ పంద్రాగస్టు తరువాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఏఐసీసీ కీలక నేత ఒకరు వాస్తవం ప్రతనిధికి చెప్పారు. దీంతో ఈసారీ పెద్దాయనకు చుక్కెదురే కానుంది. మంత్రి హోదాలో అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు అతనికి దక్కుతున్నాయి. ఓరకంగా షాడో మంత్రిగా ఆయన జిల్లాలో కొనసాగుతున్నారు. కానీ మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు, అతనికి మంత్రి పదవి దక్కే వరకు కూడా అనుమానాలే చుట్టూ ముసురుకుంటున్నాయి.