దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చేసిన అసందర్భ ప్రేలాపనతో రాజకీయ రచ్చ మొదలైంది. తను గెలిచిన తరువాత పెట్టిన ప్రెస్‌మీట్‌ కాంగ్రెస్‌ను కవ్వించేలా చేసి ఈ రెండు పార్టీలు రచ్చకెక్కి జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునే దాకా తీసుకొచ్చింది. కాంగ్రెస పార్టీ ఓటుకు 200 పంచిందని అర్వింద్‌ ఆరోపించాడు. తన మెజార్టీ తగ్గినందుకు బాధతో అన్నాడో, ఇన్ని ఓట్లు కాంగ్రెస్‌ రావడానికి కారణం పైసల పంపిణీ అని చెప్పడం అతని ఉద్దేశ్యమో తెలియదుక కానీ, ఆ మాట అనాల్సింది కాకుండె.

ఇదిప్పుడు కాంగ్రెస్‌ దొరకపట్టుకున్నది. జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టాడు. అర్వింద్‌ను తుక్కు తుక్కు తిట్టాడు. నువ్వు పంచలేదా ఐకేపీ ఆర్‌పీలతో. ఒక్కొక్కరికి 300 చొప్పున అని తనూ తొడలు చరిచాడు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేస్తానన్నాడు. ఇలా ఒకరికొకరు నువ్వింత పంచావంటే నువ్వింత పంచావంటూ దుమ్మెత్తిపోసుకున్నారు. వాస్తవానికి పార్లమెంటు ఎన్నికల్లో పెద్దగా నగదు పంపిణీ జరగదు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా. కానీ ఈసారి నిజామాబాద్‌లో ఈ రెండు పార్టీలూ పోటీ పడ్డాయి. అది అందరికీ తెలుసు. ఈ సీటు గెలుపు రెండు పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది.

అర్వింద్‌ ఈసారి ఓడితే రాజకీయంగా పుట్టగతుల్లేకుండా పోతాయి. అందుకే భయపడ్డాడు. తన గెలుపుపై మేకపోతు గాంభీర్యం పదర్శించినా లోలోన ఓటమి భయం బాగానే వెంటాడింది. దీంతో అన్ని అస్త్ర శస్త్రాలు సంధించాడు. అహంకారిగా, వ్యక్తిగత వ్యతిరేకత తీవ్రంగా మూటగట్టుకున్న నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలనుకున్నాడు. సక్సెసయ్యాడు. కాంగ్రెస్‌ కూడా ఇజ్జత్‌ కా సవాల్‌గా తీసుకున్నది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఓ వైపు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మరోవైపు ఇద్దరూ ఎవరికి వారే గెలుపు కోసం తీవ్రంగా పనిచేశారు. కానీ జీవన్‌రెడ్డి నాన్‌లోకల్‌ కావడంతో అంతగా రిసీవ్‌ చేసుకోలేదు జనం. దీనికి తోడు మోడీ హవా ఇక్కడ బాగా పనిచేసింది అర్వింద్‌కు. ఇప్పుడు ఈ పైసల లొల్లిని తెరమీదకు తెచ్చి మరోసారి రచ్చ రాజకీయానికి తెరలేపాడు అర్వింద్‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed