దండుగుల శ్రీనివాస్ – వాస్తవం చీఫ్ బ్యూరో:
ఇలా గెలిచాడో లేదో జిల్లాపై తన పెత్తనం కోసం పాకులాటలు మొదలుపెట్టాడు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మంత్రి వర్గ విస్తరణలో జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ సుదర్శన్‌రెడ్డికి కీలకమైన హోం మినిష్టర్ ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో అర్వింద్ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌లో సుదర్శన్‌రెడ్డిని టార్గెట్ చేశాడు. తన గెలుపు గురించి పక్కన పెట్టి.. తానేం చేస్తాడో వాటి గురించి పెద్దగా ప్రస్తావించకుండా.. మేం చేస్తాం.. కానీ మీరే అడ్డొస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పట్నుంచే నెపం నెట్టేసే ప్రయత్నం చేశాడు ఎంపీ. ఇక ప్రెస్‌మీట్‌లో మేజర్ భాగం సుదర్శన్‌రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికే సమయం కేటాయించాడు.
లిక్కర్ దందా చేసి కోట్లు గడించాడని నేపథ్యాన్ని తీసుకుని ఇప్పటి వరకు ఆయన చేసిన అరాచకాలివి అంటూ ఏకరువు పెట్టాడు. “కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్లను, పోలీసు అధికారులను బెదిరించడమే ఆయన పని.. బుగ్గ కారు కావాలె ఆయనకు.. అంతే జిల్లాకు ఏం చేశాడు ఇప్పటి వరకు .. ఆయనకు వచ్చిన మెజార్టీ ఎంత…? ఎవరికైనా న్యాయం చేశాడా..? బోదన్ ఎమ్మెల్యేకు నిజామాబాద్‌లో ఏం పని..? ఎవరైనా వస్తే ఎవరికి వేశావురా ఓటు అని అహంకారంగా మాట్లాడటం మాత్రం వచ్చు..’ అంటూ వ్యక్తిగత దాడికి దిగాడు ఎంపీ. తను రెండోసారి ఎంపీ అయిన ఆనందం కంటే జిల్లాపై తన పెత్తనం కోసం సుదర్శన్‌రెడ్డిని డమ్మీ చేసే ప్రయత్నం బాగా చేశాడు అర్వింద్.
గతంలో టీఆరెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రశాంత్‌రెడ్డిని కూడా ఇలాగే టార్గెట్ చేశాడు. రెచ్చగొట్టాడు. వార్తల్లో కెక్కాడు. ఇప్పుడు అదే పాలసీని స్టార్ చేశాడు ఎంపీ. ఓటుకు 200 పంచాడంటూ సుదర్శన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూనే.. ఆ పైసలన్నీ సగానికిపైగా నాయకులే బొక్కేశారని వెక్కిరించాడు. తను కూడా మహిళా సంఘాలు 300 పంచాడనే ఆరోపణలు ఉన్నాయి.
మీడియా మేనేజ్‌మెంట్ బహుబాగుగా కానిచ్చేశాడు. ఓడుతాడనే భయం వెంటాడింది అర్వింద్‌కు. బాగానే పైసలు తీశాడు. ఖర్చు చేశాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాడు. ఆ 200 సరిపోతాయన్న అర్వింద్.. పరోక్షంగా తాను అంతకన్నా ఎక్కువే పంచానని ఒప్పుకున్నాడు ప్రెస్‌మీట్ వేదికగా.