దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

సైలెంట్‌ మాకా మీకా..? కాదు మాకే.. కాదు కాదు మాకే అంటూ వచ్చిన బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈ రిజల్టు ఎవరి వైపో తేటతెల్లం చేశాయి. కాంగ్రెస్‌ సైలెంట్‌ ఓటింగ్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మాట వాస్తవం. చాలా మంది కాంగ్రెస్‌కు ఓటేసిన విషయం చెప్పడం లేదని, అవన్నీ తమకు కలిసి వస్తాయని, గెలుపు తీరాలకు చేర్చుతాయనీ భావించారు. కానీ అలా జరగలేదు. సైలెంట్‌ ఓటింగ్‌ అంతా బీజేపీ డైవర్ట్‌ అయ్యింది. తాము పువ్వుకే ఓటేశామని ఈసారి ఓటర్లు బాహాటంగానే చెప్పుకొచ్చారు. చెప్పనివారు కాంగ్రెస్‌కు వేసి ఉంటారని భావించారు. కానీ చెప్పిన వారు, చెప్పని వారు మెజార్టీగా అంతా పువ్వుకే వేశారని ఫలితాలు చూస్తే తేలిపోయింది.

మోడీ ముఖం, అయోధ్య రాం మందిర నిర్మాణం, హిందూత్వ భావం.. ఇవన్నీ మెజార్టీ ఓటర్లను ప్రభావితం చేశాయి. దీంతో చాలా చోట్ల అభ్యర్థులతో సంబంధం లేకుండా బీజేపీ జపం చేశారు ఓటర్లు. దీనికి తాజా ఉదాహరణ నిజామాబాద్‌ లోక్‌సభ స్థానమే. ఇక్కడ అర్వింద్‌కు తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అయినా లక్షా పై చిలుకు బంపర్‌ మెజార్టీతో గెలుపొందాడు అర్వింద్‌. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం,మైనార్టీలు కూడా అత్యధికంగా ఉన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇది హిందువులకు, ముస్లింలకు మధ్య జరిగే యుద్దం అనే రీతిలో బీజేపీ ప్రొజెక్ట్‌ చేయడంలో సక్సెసయ్యింది. దీంతో ఇక్కడ కమ్యూనల్‌ ఎలక్షన్‌గా మారింది. ఇదే అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, గుణగణాలను, ఇతర లోపాలను పక్కన పెట్టేసింది. ఓటర్లు ఒక్కటే ఆలోచించారు. మోడీ మళ్లీ రావాలె. బీజేపీకి ఓటేయ్యాలె.. అంతే..! అదే జరిగింది.

సైలెంట్‌ ఓటు పై గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు అదే తమ కొంప ముంచిందని ఇవాళ తెలుసుకున్నది. తాము పెట్టుకున్న అంచనాలను కాంగ్రెస్‌ రీచ్‌ కాలేకపోయింది. పదికి పైగా స్థానాలను దక్కించుకుందామని విపరీతంగా ప్రయత్నం చేసినా.. 8 స్థానాలతో సరిపెట్టుకున్నది. ఇంత మాత్రం సీట్లు రాబట్టుకున్నదనంటే అది కాంగ్రెస్‌ నాయకత్వం, కార్యకర్తల గొప్పతనమే.

 

You missed