దండుగుల శ్రీనివాస్‌- చీఫ్‌ బ్యూరో:

నిజామాబాద్‌ పార్లమెంటు సీటుపై కాంగ్రెస్‌ ఆశలు ఇంకా చావలేదు. తక్కువ మెజార్టీతోనైనా గెలుపు ఖాయమని ఇందూరు కాంగ్రెస్‌ నేతలు లెక్కలేసుకుంటున్నారు. కనీసం యాభై వేల మెజార్టీతో జీవన్‌రెడ్డి గెలుస్తాడని అంచనాలు వేసుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు.. ఒకవేళ మోడీ హవా కొనసాగితే మాత్రం ఆ పార్టీ మెజార్టీని అంచనా వేయలేమని, ఎక్కువగా ఉంటుందని కూడా భయపడుతున్నారు.

బీఆరెస్‌ అభ్యర్థికి ఎన్ని ఎక్కువ ఓట్లు వస్తే అంత తమకే లాభం అని సమీకరణలు వేసుకుంటున్నారు. బీఆరెస్‌కు తక్కువ ఓట్లు వస్తే అది తమ కొంపే ముంచుతుందని కూడా అనుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ గెలవాలని వ్యక్తిగతంగా ఓ ఒక్కరు అనుకోవడం లేదని, నెక్‌టునెక్‌ పోటీ అనేది నిజంగా ఉంటే అది తమకే లాభమని కూడా భావిస్తున్నారు. మోడీ, రాంమందిర్ కే ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపితే తాము కూడా ఏం చేసేది లేదని, అది అర్వింద్‌కే అంతిమంగా కలిసివచ్చే అంశమనే విషయాన్ని వారే పరోక్షంగా ఒప్పుకుంటున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు గండిపడితే కష్టమని అనుకుంటున్నారు. జగిత్యాల, నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌ నియోజకవర్గాల్లో తమకు కలసి వస్తుందని, ఎంత మెజార్టీ రావొచ్చో లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో మిగిలిన నాలుగు నియోజకవర్గాలు ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్, కోరుట్ల, బాల్కొండలలో తమకు మెజార్టీ పెద్దగా రాబోదనే విధంగా ఓటింగ్‌ సరళి ఉందని అంచనాలు వేసుకుంటున్నారు.

సైలెంట్‌ ఓటు ఎవరి కొంప ముంచుతుందోననే భయం వెంటాడుతోంది కాంగ్రెస్‌కు. ఆ సైలెంట్‌ ఓటు తమకే పడితే యాభైవేల మెజార్టీ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ సైలెంట్ ఓటు బీజేపీకి వెళ్తే అర్వింద్‌ దూకుడును ఊహించలేమని కూడా భయపడుతున్నారు.

You missed