దండుగుల శ్రీనివాస్‌ – సీనియర్‌ జర్నలిస్టు:

కేసీఆర్‌ ఇక జన్మలో మారడు. మారిండని మీరు భ్రమించారా.. మళ్లీ దశాబ్దాల మోసానికి బలి కాబోతున్నారన్నమాటే. కేసీఆర్‌ ఉన్న బలం స్పీచ్‌ పవర్‌. అదే అతన్ని ఈస్థాయికి చేర్చింది. దించింది. ఇప్పుడు అధికారం పోయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో స్పీచ్‌ ఇచ్చాడు. పరమ బోరింగ్‌, రొడ్డ కొట్టుడు స్పీచ్‌. ఆనాటి ఉద్యమ జ్ఞపకాలను అన్నీ నెమరేసుకున్నాడు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ గ్రేట్‌ అన్నాడు. ఉద్యమకారుల చాలా ఉద్యమాలు చేశారంటూ టీఎన్జీవోల ప్రస్తావన తెచ్చాడు.

ఫక్తు ఇక మాది రాజకీయమే అంటూ అధికారం రాగానే ప్రకటించి తన అహంకారాన్ని, అధికార దాహాన్ని ప్రదర్శించుకున్న కేసీఆర్.. ఇప్పుడు అధికారం కోల్పోగానే మారిన మనిషినయ్యాననే బిల్డప్‌ ఇచ్చాడు. మొన్నటి దాకా మేకవన్నె పులి. ఇప్పుడు పులి వన్నెమేక. ఉద్యమ సెంటిమెంట్‌ ను మళ్లీ రాజేసే ప్రయత్నం. తనకు అనుకూలంగా మలుచుకునే కుయుక్తి. ఇదంతా గడిచిన ఎత్తుగడల ప్రయోగాల ప్రయత్నం. ఇవిప్పుడు చెల్లని ఎక్స్‌పర్‌మెంట్స్‌ కేసీఆర్‌. నిన్ను నమ్మేలా లేరు జనాలు.

ఉద్యమకారులను మొత్తం తొక్కిపెట్టి.. రాజకీయ పునరేకీకరణ పేరుతో నీ సుస్తిరతను కాపాడుకునే ప్రయత్నం చేసి ఫక్తు రాజకీయ నాయకుడిగా వ్యవహరించిన అహంకార సీఎంకు తగిన బుద్ది చెప్పారు జనాలు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టు గంటల స్పీచ్‌ దంచాడు ఇవాళ కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో. హుందా రాజకీయాలకు కేసీఆర్‌ స్వస్తి పలికాడు. చీప్ రాజకీయాలకు తెరలేపాడు.

కేటీఆర్‌ను సీఎం చేయాలనే యావలో తనకు మించిన నాయకుడు లేడనే అతివిశ్వాసంలో, కూతురును కాపాడుకునే క్రమంలో వ్యవహరించిన తలపొగరు నిర్ణయాలతో చంకనాకిపోయిన కేసీఆర్‌, బీఆరెస్‌ను ఇప్పట్లో కాపాడేందుకు ఎవరూ లేరు. కేసీఆర్ ఒక్కడికే ఆ చాన్స్‌ ఉంది. కానీ ఇలా ఇప్పటికీ జనాలను తక్కువ అంచనా వేసి పిట్టల దొర మాటలు మాట్లాడి బుట్టలో వేసుకుని మళ్లీ అధికారంలోకి వస్తాయని ఊహాలోకంలో విహరించడం అతని భ్రమే తప్ప నిజం కాబోదు.

నీ తప్పులకు, పాపాలకు ఇంకా చాలా కాలం పాటు శిక్ష అనుభవించేది ఉంది. అనుభిస్తావు. అంతే అంటున్నారు తెలంగాణ జనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed