దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

ఇందూరు కాంగ్రెస్‌ మరింత బలపడనుంది. తిరుగులేని శక్తిగా ఎదగనుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ మరింత పుంజుకుంటున్నది. కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. దీనికి తోడు త్వరలో కేబినెట్‌ విస్తరణలో జిల్లా నుంచి ప్రయార్టీ ఇవ్వనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని తేలిపోయింది. హోం శాఖ కూడా ఇస్తారన ప్రచారమూ ఉంది. ఇదే నిజమయ్యేలా ఉంది. ఇక పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు కూడా అధిష్టానం మంచి ప్రయార్టీనే ఇవ్వనున్నది. వాస్తవంగా మహేశ్‌ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నాడు.

కానీ పీసీసీ చీఫ్‌ ఇచ్చేందుకే అధిష్టానం మొగ్గు చూపుతున్నది. ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆయన సక్సెసయ్యాడు. ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలున్న మహేశ్‌కు పీసీసీ చీఫ్‌ ఇస్తే ఇక్కడ జోడెద్దుల బండిలా రేవంత్‌తో కలిసి ఇటు పార్టీని, ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపగలరనే విశ్వాసం ఢిల్లీ పెద్దలకు కుదరింది. దీంతో మంత్రి పదవి కాకుండా మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు పీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వనున్నారు.

రేవంత్‌రెడ్డి సీఎంగా ఉండటం, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఉండటంతో పీసీసీ చీఫ్ కచ్చితంగా బీసీకే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో బీసీల్లో ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలుండి, పార్టీకి విధేయుడిగా ఉన్న మహేశ్‌కు ఇస్తేనే ఈ పదవికి న్యాయం చేస్తాడనే నమ్మకంతో వారున్నారు. దీంతో ఈ ఇద్దరి పదవుల విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది.

ఇక ప్రకటించడమే తరువాయిగా ఉంది. జూన్‌ రెండోవారంలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఇందులో సుదర్శరెడ్డికి బెర్త్‌ ఖరారయిపోయింది. పీసీసీ చీఫ్‌ కూడా త్వరలో ప్రకటిస్తారు. అద్దంకి దయాకర్‌ ఇస్తారని ప్రచారం జరిగినా డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఉన్నందున అద్దంకి మళ్లీ ఈసారి ఛాన్స్‌ మిస్సయ్యింది. బీసీ కార్డుతో పాటు విధేయతకు పట్టం కడుతూ మహేశ్‌కు పీసీసీ పగ్గాలు ఇచ్చేందుకు రంగం సిద్దమయ్యింది.

You missed