వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌:

ఆర్మూర్‌ జీవన్‌మాల్‌ ఇష్యూను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సీరియస్‌గా తీసుకున్నాడు. ఇది ఇద్దరి మధ్య వివాదంగా మారింది. ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆ షాపింగ్‌ మాల్‌కు బకాయిలు చెల్లించకుండా ఏకంగా సజ్జనార్‌ అవినీతి పరుడంటూ అతని ఆ పదవికి పనికే రాడంటూ ప్రెస్‌మీట్లు పెట్టి చెప్పండంతో తాచుతోక తొక్కినట్టయ్యింది. దీంతో సజ్జనార్‌ మొన్న ఎన్నికలు ముగియగానే జప్తు చేసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చాడు. దీనిపై జీవన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వారం రోజుల గడువిచ్చింది. అప్పటి వరకు మాల్‌ను తెరిపించాలని ఆర్టీసీని ఆదేశించింది.

అయితే జీవన్‌రెడ్డి ఈ వారం రోజుల గడువు, బకాయిల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది..అంటూ కొన్ని మీడియా చానళ్లను అక్కడకు తీసుకుపోయి నానా హంగామా చేశాడు. సజ్జనార్‌ ఊరుకుంటాడా..? అసలే ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టాయే..? ఆ మరుసటి రోజే కారం పూసిన ఓ స్వీట్‌ ట్వీట్‌ను వదిలాడు. తెరిచాం. ఓకే. హైకోర్టు ఆదేశాలు పాటించాం. సరే. కానీ ఆ ఉత్తర్వుల్లో వారం రోజులే గడువుంది సుమా..! ఆ తరువాత కూడా ఇదే పరిస్థితి ఉంటే మళ్లీ జప్తు చేసుకుంటాం.. నోటీసీలు గీటీసులు కూడా ఇవ్వం.. అంటూ తనదైన శైలిలో ఓ వార్నింగ్‌ కమ్ సమాచారం ఇచ్చాడు.

అంటే ఇక నిన్ను వదలను.. కోర్టు ఉత్తర్వులు ఎన్నో రోజులు నిన్ను కాపాడలేవు అంటూ పరోక్షంగా సిగ్నల్‌ ఇచ్చాడు ఆర్టీసీ ఎండీ. ఇలా ఇద్దరి మద్య వివాదంగా ఇది మరింది. మరి వారం తరువాత మళ్లీ ఏం జరుగుతుందో చూడాలి. ఈ బంద్‌ చేసుడు, తెరుచుడు, తాళాలేసుడు, తీసుడు ఏమో గానీ అందులో లీజుకు తీసుకున్న షాప్‌ ఓనర్లకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదేం లొల్లిలా నాయనా..? అనవసరంగా దీంట్లో మేం ఇరుక్కున్నామని వాపోతున్నారు పాపం..! జీవన్‌రెడ్డితో పెట్టుకుంటే అట్లుంటది మరి.

 

You missed