దండుగుల శ్రీనివాస్ – వాస్తవం చీఫ్ బ్యూరో:
అతను బీఆరెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు. అంతకు ముందు ఆర్మూర్ ఎమ్మెల్యే. ప్రస్తుతం మాజీ. కవితక్కకు దగ్గరంటాడు. రామన్న పేరు వాడుకుంటూ ఉంటాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. మీడియా కథనాలు రాస్తే బెదిరిస్తాడు. దాడులకూ తెగబడతాడు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతనే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడి అధికార దుర్వినియోగానికి పాల్పిడిన జీవన్.. ఇప్పుడు అధికారం లేకపోయినా.. ఎప్పుడూ వార్తల్లో కేంద్ర బిందువుగా నిలుస్తాడు.
ఆర్మూర్‌లో ఆర్టీసీ స్థలాన్ని లీజ్‌కు తీసుకుని జీవన్‌మాల్ పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకుని కిరాయి ఎగ్గొట్టిన కేసులో అది నిన్నటి వరకు ఆర్టీసీ జప్తు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో దాన్ని ఇవాళ తెరిపించుకున్నాడు. ఇదో పెద్ద వార్తగా, సంచలనంగా దాన్ని పబ్లిసిటీ చేయించుకున్నాడు. మీడియా పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. ఈ తంతు ఇలా ముగియకముందే చేవెళ్లలో దామోదర్‌రెడ్డి జీవన్‌రెడ్డిపై కేసు పెట్టాడు. ఓ ల్యాండ్ కేసులో తనను బెదిరించి దాడులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బెదిరింపులు ఎల్లకాలం చెల్లవు. చంపుతాననే బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు చివరకి వారి అంతానికి దారి తీస్తుంది. ఇది చరిత్ర. ఇప్పుడు జీవన్‌రెడ్డి కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. పార్టీ పరువు గంగలో కలిసినా సరే తన ప్రచారం తనది. తన పరపతి తనకు. తన గొప్పలు తనవి. తనే అంతా. అంతా తానే. అంతే. ఇవే అతని కొంపముంచింది. అయినా మారలేదు.
కేటీఆర్, కేసీఆర్ కూడా ఈ విషయంలో పెద్దగా వారించలేదు. ఇప్పటికే పార్టీ పరిస్థితి అంతంత మాత్రం. ఇలా జిల్లా అధ్యక్షుడు మీడియా ప్రచార యావలో కొట్టుకుపోతే.. వివాదాలకు కేంద్ర బిందువవుతే.. బెదిరింపు రాజకీయాలకే ఇంకా ఆలంభనగా మార్చుకుని ముందుకు పోతే.. అధికారం ఉన్నట్లుగాన ఇంకా అదే ట్రాన్స్‌లో జీవిస్తే.. పార్టీకి జీవం పోసినవాడవుతాడా..? ఆలోచించాలి అధిష్టానం.