వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు వైద్యరంగంపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న ఆయన .. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుని సక్సెస్ అయ్యారు. ఇటీవల మెడికవర్, షాహిన్ తదితర హాస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన సీరియస్‌గా యాక్షన్ తీసుకునేందుకు రంగం రెడీ చేశారు. మెడికవల్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ యువకుడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఇది రచ్చకెక్కింది. గతంలో కూడా ఈ ఆస్పత్రి పలు వివాదాలకు కేంద్ర బిందువైంది. దీనిపై కలెక్టర్ ఎక్స్‌పర్ట్ కమిటీని విచారణకు ఆదేశించారు.
ఒక మెడికల్ విభాగమే కాదు.. ఇతర శాఖల అధికారులతో కూడా సమాంతరంగా దీనిపై సీరియస్‌గా లోతైన విచారణ జరుగుతోంది. దీంతో నిజనిజాలు నిగ్గుతేల్చి తగు చర్యలకు ఉపక్రమించింది జిల్లా యంత్రాంగం. మరోవైపు షాహిన్ ఆస్పిటల్‌లో అనవసరంగా గర్బాశయం తొలగించారని ఆరోపణలు ఎదుర్కోవడంతో రంగంలోకి దిగింది వైద్యాధికారుల బృందం. దీనిపై నివేదిక రెడీ అయ్యింది. చర్యలే మిగిలి ఉన్నాయి. తాజాగా కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిపై నజర్ పెట్టారు. బుధవారం ఆయన ప్రభుత్వ ఆసుప్రతుల పనితీరు, సౌకర్యాలు, లోపాలు, వైద్యుల ఖాళీలు, పేషెంట్లకు అందుతున్న సేవలపై వైద్యాధికారులతో లోతైన చర్చ జరిపారు.
గంటల పాటు రివ్యూ తీసుకున్నారు. అన్ని విషయాలు, విభాగాల పనితీరుపై సమీక్షించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయించడంతో పాటు వైద్యల సేవలు మరింత పెరగాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారికి ఉద్బోద చేశారు. కావాల్సిన కనీస సౌకర్యాలపై దృష్టి పెట్టారు. ఓవైపు ప్రైవేటు దవాఖానల అవినీతి,నిర్లక్ష్యం,పేద ప్రజలను దోచుకు తినే కక్కర్తి వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి పెట్టి చర్యలకు ఉపక్రమించిన కలెక్టర్.. అదే సమయంలో సర్కార్ వైద్యాన్ని మరింత మెరుగుపర్చే చర్యలకు పూనుకున్నారు.