దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కుంట రమేశ్‌రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల బాల్కొండ కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్‌రెడ్డి కినుక వహించాడు. దీనంతటి కారకుడైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిపై భగ్గుమంటున్నాడు. డీసీసీబీ అవిశ్వాస తీర్మానం.. రమేశ్‌రెడ్డికి చైర్మన్ గిరీ ఇద్దరి మధ్య కోల్డ్ వార్‌కు తెరతీసింది. తన ఓటమికి ప్రధాన కారకుడైన కాంట్రాక్టర్ రమేశ్‌రెడ్డిని ఎలా చైర్మన్ చేస్తారని బాహాటంగానే ప్రశ్నిస్తున్నాడు సునీల్.
కుంట రమేశ్‌రెడ్డికి, సుదర్శన్‌రెడ్డికి మధ్య దగ్గరి బంధుత్వం ఉంది. దీనికి తోడు తను ఓడిపోయినా.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బాల్కొండలో ఇప్పుడు సునీల్‌రెడ్డి షాడో ఎమ్మెల్యే. దీంతో ప్రభుత్వం ఏర్పడీ ఏర్పడగానే రమేశ్‌రెడ్డి బాల్కొండలో చేసిన కాంట్రాక్టు పనుల పెండింగ్ బిల్లులపై నజర్ పెట్టాడు. అప్పటికే వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. అయితే ఈ పనులన్నీ నాసిరకం పనులని సునీల్‌రెడ్డి దాడి ప్రారంభించాడు. ఈ పనులకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేస్తూ వివిధ శాఖలకు విజిలెన్స్ ఎంక్వైరీ కోసం ఫిర్యాదు కూడా చేయడంతో ఈ అంశం కలకలం రేపింది.
దీందో రమేశ్‌రెడ్డి మధ్యే మార్గంగా ఇటు చైర్మన్ గిరీతో పాటు సునీల్‌రెడ్డి బెడత పోతుందని భావించాడు. దీంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపాడు. 14 మంది డైరెక్టర్లను తీసుకుని గోవా టూర్‌కు వెళ్లాడు. దాదాపు కోటి దాకా ఖర్చు పెడుతున్నాడు. రేపు అవిశ్వాస పరీక్ష ఉంది. ఇక కుంట రమేశ్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్ కావడం లాంఛన ప్రాయమే. ఈ క్రమంలోనే తన దాడిని మరింత తీవ్రతరం చేశాడు సునీల్‌రెడ్డి.
నేరుగా సుదర్శన్‌రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యాడు. రమేశ్‌రెడ్డికి పదవి ఇవ్వడం తనను కించపరచడమేనని, అవమానపరచడమేనని తేల్చి చెప్పాడు. రమేశ్‌రెడ్డి అవినీతి అక్రమాలపై పోరాటం ఆపేది లేదంటూ అల్టిమేటం జారీ చేసి వచ్చాడు. ఇదిప్పుడు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెరతీసింది.