దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ పై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. తుది జాబితా నేడు విడులవుతున్నా అందులో నిజామాబాద్ అభ్యర్థి పేరు ఉండదు. ఎందుకంటే దీనిపై క్లారిటీ రాలేదు. పెండింగ్‌లోనే నిజామాబాద్ ఉండిపోయింది. దీంతో ఈ సీటు ఎవరికి కేటాయిస్తారు..? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఆ పార్టీలోనే కాదు.. ఇతర పార్టీ నేతలు కూడా ఎవరికిస్తారు..? ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా.. అది ట్విస్టులతో కూడిన సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. జీవన్‌రెడ్డికి దాదాపు పోటీ నుంచి అధిష్టానం దూరం చేసిందనే చెప్పాలి.
ఓడిననేతలకు మళ్లీ పోటీకి అవకాశం ఇవ్వరాదనే పార్టీ పాలసీ జీవన్‌రెడ్డికి శాపంలా మారింది. దీంతో అతన్ని పక్కన పెట్టే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సీటు ఎవరికివ్వాలి అనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుండగా.. జీవన్‌రెడ్డి.. అరెకెల నర్సారెడ్డి పేరును సూచించినట్టు తెలుస్తోంది. తనకు అవకాశం ఇవ్వకపోతే నర్సారెడ్డికి చాన్స్ ఇవ్వండని అధిష్టానానికి సూచన చేసినట్టు తెలుస్తోంది. దీంతో తుది జాబితాలో నిజామాబాద్ పేరు లేకుండా విడుదల కానుంది. నిజామాబాద్ అభ్యర్థి ఎవరన విషయంపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.