దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

నిజామాబాద్ కాంగ్రెస్‌ ఎంపీ సీటు ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీలను పక్కనబెట్టి రెడ్లకు ఇక్కడ అవకాశం ఇచ్చేందుకు అధిష్టానం రెడీ అయ్యింది. జగిత్యాల జీవన్‌రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. మొన్నటి దాకా బరిలో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ కూడా టికెట్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ బీసీలకు చెక్‌పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ వల వేశాడు. ఈరవత్రి అనిల్‌కు మినరల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్‌ను చేశాడు. దీంతో ఈరవత్రి అనిల్‌ అడ్డుతొలగిందని భావించారు.

ఇక జీవన్‌రెడ్డి పేరును కాదని చివరలో బాల్కొండ నుంచిపోటీ చేసిన ముత్యాల సునీల్‌రెడ్డి పేరును అధిష్టానం పరిగణలోకి తీసుకున్నది. జీవన్‌రెడ్డిని కరీంనగర్ నుంచి పోటీ చేయాల్సిందిగా సూచించింది. కానీ జీవన్‌రెడ్డి ససేమిరా అన్నాడు. తాను నిజమాబాద్‌ నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టాడు. దీంతో ఇద్దరు రెడ్లలో ఎవరిని ఫైనల్‌ చేయాలబ్బా..!అని అధిష్టానం తలపట్టుకుని కూర్చున్న సమయంలో.. మధ్యలో ఈరవత్రి అనిల్‌ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తనకు కార్పొరేషన్‌ పదవి ఇచ్చినా.. ఎంపీ సీటును వదిలేది లేదంటూ తన లాబీయింగ్‌ తను చేస్తున్నాడు.

బీసీగా పద్మశాలికి ఇక్కడి నుంచి తనకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానంటూ సమీకరణలన్నీ అధిష్టానం ముందుంచుతున్నాడు. రెడ్లకు కాదు నాకే టికెట్‌ కావాలని ఢిల్లీలో తిష్టవేసి చివరగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ సీటు ఇద్దరు రెడ్ల మధ్య ఓ బీసీగా మారింది. ఎవరికి టికెట్‌ అనే విషయంలో విపరీతమైన సస్పెన్స్‌ కొనసాగుతున్నది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఒకట్రెండు రోజులు పట్టేలా ఉంది.

 

You missed