దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

పార్లమెంటు ఎన్నికల ముందు ఇందూరు జిల్లా కాంగ్రెస్‌లో పదవుల చిచ్చురేగింది. ఎంపీ టికెట్‌ కోసం పోటీ పడ్డ ఈరవత్రి అనిల్‌కు రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వడంతో అతను కినుక వహించాడు. సీనియర్‌ లీడర్‌గా పార్టీ కోసం బాల్కొండ సీటు త్యాగం చేసిన నేతగా బీసీ పద్మశాలిగా తనకు తప్పుకుండా అవకాశం వస్తుందనే భారీ నమ్మకంతో అనిల్‌ ఉన్నాడు. తీరా ఉన్నపళంగా ఎలాంటి సమాచారం లేకుండా అతనికి ఈ కార్పొరేషన్‌ పదవిని కట్టబెట్టాడు సీఎం రేవంత్‌రెడ్డి. రెడ్లకు టికెట్‌ ఇచ్చేందుకే బీసీలను ఇలా కార్పొరేషన్‌ పదవులతో సరిపెట్టి అడ్డుతొలగించుకుంటున్నారనే ప్రచారమూ ఊపందుకున్నది. తమకు కేటాయించిన పదవులపై ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయకున్నా లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఎంతో కాలం పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలంతా ఇప్పుడు ప్రభుత్వంలో తమకు తగిన గుర్తింపు ఉంటుందని భావించారు. కానీ ఇలా రాజకీయ సమీకరణలే ప్రధానంగా తీసుకుని చిన్న చిన్న పదవులతో సరిపెట్టడం వారిలో అసంతృప్తిని రాజేస్తున్నది. కానీ ఎవరూ బయటపడలేదు. అనిల్‌ మాత్రం ఎంత నచ్చజెప్పినా తనకు ఇది తగిన పదవి కాదనే భావిస్తున్నాడు. దీంతో ఈ పదవిని కేటాయించినా.. అనిల్‌ మాత్రం ఢిల్లీ లెవల్‌లో లాబీయింగ్‌ మాత్రం ఆపడం లేదు ఎంపీ టికెట్‌ కోసం. ఇదిప్పుడు కొత్త పంచాయితీకి తెర తీసింది. ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లో కేంద్రబిందువవుతూ ఉంటాయి. తాజాగా పదవుల పందేరం ఇందూరు కాంగ్రెస్‌ను మరోసారి వార్తల్లోకి ఎక్కించగా.. ఢిల్లీలో నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ కేటాయింపుపై మళ్లీ మంతనాలు మొదలయ్యాయి.

మానాల మోహన్‌రెడ్డికి కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌..

జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డికి అధిష్టానం రాష్ట్ర కో ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా నియమించింది. సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితుడిగా మానాల ఉన్నాడు. అతనికి సముచిత స్థానం దక్కిందనే ఆనందంలో మోహన్‌రెడ్డి వర్గీయులున్నారు. రాష్ట్ర కిసాన్‌ ఖేత్‌ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డికి కూడా మంచి పదవే దక్కింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ను చేశారు. బాన్సువాడ కాంగ్రెస్‌ లీడర్‌ కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ను చేశారు. పార్లమెంటు ఎన్నికల ముందు కార్పొరేషన్‌ పదవులు ఇవ్వడం ద్వారా మరింత రెట్టించిన ఉత్సాహంతో వీరంతా పనిచేస్తారని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నది.

You missed