దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

కేసీఆర్‌ కుటుంబం… అంటే ఒకప్పుడు ఓ ప్రేమ. అది ఉద్యమకాలం నాటి మాట. కానీ అధికారం వచ్చిన తరువాత లోపలున్న మనుషులు బయటకు వచ్చారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక పై ఒక లెక్క అన్నట్టు అంతా మారారు. ముందుగా కేసీఆర్‌ లోపలి మనిషిని తెలంగాణ సమాజానికి చూపించాడు. కేసీఆర్ ఇలా ఉంటాడా..? ఇలా ప్రవర్తిస్తాడా..? ఇలా మాట్లాడతాడా..? అని కొద్ది రోజుల్లోనే నోరెళ్లబెట్టేలా చేశాడు. అప్పటికే ఆయనలో అహంకారపు దొర ఒకడున్నాడు. ఇక అధికారం రాగానే అది రెట్టింపయి బాహాటంగా బయటకు వచ్చి ఎటుపడితే అటు మాట్లాడటం, తనకు నచ్చిందే చేయడం.. పిచ్చి తుగ్లక్‌ వేశాలు వేయడం తన స్టైల్‌గా మార్చుకున్నాడు. రెండు టర్ములు భరించారు. పదేండ్లు ఓపిగ్గా చూశారు. చివరకు కర్రు కాల్చి వాత పెట్టారు.

ఇప్పటికీ కేసీఆర్‌లో అహంకారం తగ్లేదు. అవే బలుపు మాటలు. చేసిందంతే చేసి తప్పులు తెలుసుకోకుండా జనాలను దురాశ పరులుగా అభివర్ణించే దొర మనస్తత్వం సమయం దొరికినప్పుడల్లా బయటపెట్టుకుని మరింత పలుచనవుతున్నాడు. ఇక కేటీఆర్‌ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. షాడో సీఎంగా అధికారాన్ని అనుభవించాడు. ఇక తనకు తిరుగులేదనుకున్నాడు. జోకర్లను, పైసాకు కొరగాని నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. చీప్‌ అయ్యాడు. ఓడిన తరువాతా అదే పంతాను అనుసరించాడు.

తండ్రి బాటలోనే సాగుతున్నాడు. ఇక జన్మంలో కేసీఆర్‌ సీఎం కాలేడు… కేటీఆర్‌ ఆ దరిదాపుల్లోకి రాలేడు అనే విధంగానే ఉంది ఇద్దరి ప్రవర్తన. ఇక బిడ్డ కవిత. ఆమెను నమ్ముకుని ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందిరికీ మోచేతికి బెల్లం పెట్టి ఓ చిరునవ్వు నవ్వి అన్నా బాగున్నావ అని పలకరించి పోవడమే.. కానీ ఎవరికీ ఏమి చేసింది లేదు. కోట్లాది రూపాయలు ఆర్జించి ఆ పార్టీ నాయకులనే ఆదుకున్న పాపాన పోలేదు ఆమె. అందుకే ఈ పాపాలు ఇలా వీరిని వెంటాడుతున్నాయి. సంపాదించింది చాలదంటూ తగుదునమ్మా అని లిక్కర్‌ దందాలో కూడా వేలు పెడితే..అందులో ఓ మహిళ ఇంక సానుభూతి ఉంటుందా..? అదే జరిగింది.

అక్క జైలుకు పోయింది .. అనే వార్త ఎవరినీ పెద్దగా కదలించడం లేదు. అయ్యో పాపం అని వారి నోట వెంట రావడం లేదు. అధికారం కోల్పోయి కేసీఆర్‌ అలా అయ్యాడా.. అని ఎవరూ కించిత్‌ కూడా బాధపడటం లేదు. ఎందుకు..? ఎందుకీ గతి పట్టింది ఈ కుటుంబానికి..? ఎవరు కారకులు..? ఉద్యమకారులుగా, ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చింది మేమే అని తెలంగాణ సమాజాన్ని ఒప్పించిన ఈ కుటుంబమే ఇలా కుంటిదైపోయినా కనికరం రావడం లేదెందుకు..? కారకులు ఎవరో కాదు వారే. ఓ కేసీఆర్‌. ఓ కేటీఆర్‌. ఓ కవిత.

You missed