దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
కాలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడుతాడంట. అట్లనే ఉంది అర్వింద్ పరిస్తితి. అర్వింద్ అంటేనే తీవ్ర వ్యతిరేకత. ఇంటా బయట కూడా. కానీ మళ్లీ సిట్టింగ్‌కే టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. ఎలాగైనా ఈసారి ఓడగొడదామని అంతా కసి మీద ఉన్నారు. ఇంటా బయట. కానీ ఎందుకో అర్వింద్ వరుసగా అన్ని పాజిటివ్ అంశాలే ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న పసుపు ధర రికార్డ్ స్థాయి పెరిగింది. పుసుపు బోర్డు ఏదీ..? రైతుల నిండా ముంచావు.. అని నిలదీసే లోపే పెరిగిన ధర ప్రతిపక్షాల నోటికి తాళం వేసింది. అర్వింద్‌కు ఈ పరిణామం నెత్తిన పాలుపోసినట్టయ్యింది.
ఇది నావల్లే. నేనే చేశాను. అంతా నేనే. క్రెడిబిలిటీ అంతా నాకే.. అనే లెవల్లో ప్రచారం చేసేసుకున్నాడు అర్వింద్. పాపం.. బీఆరెస్, కాంగ్రెస్‌కు ఏమనాలో తెలియక అలా నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాయి. ఇక ఇప్పుడు కవిత అరెస్టు. లిక్కర్ స్కాం కేసును అప్పుడప్పుడు తవ్వి తీస్తూ అరెస్టు తప్పదు.. తప్పదు అంటూ బెదిరిస్తూ వచ్చిన అర్వింద్‌కు ఆ సమయం రానే వచ్చింది.
ఇప్పుడు బాజాప్తా ఆ కేసు .. అరెస్టు పర్వం అంతా తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. ఇప్పుడు కవితను కూడా సవాల్ చేస్తూ రెచ్చగొట్టే రాజకీయానికి తెరలేపాడు. నాపై పోటీ చేస్తానన్నావ్.. ఓడిస్తానన్నావ్.. ఏమైంది… జైలు నుంచి నామినేషన్ వేస్తావా..? అనే మాటలు ఇవాళ ఆర్మూర్ మీడియా ముందు మాట్లాడటం సంచలనం రేపాయి. బీఆరెస్ దీనిపై ఏమీ మాట్లాడేలా లేదు. కాంగ్రెస్ ఏమో అభ్యర్థినే ఇంకా ప్రకటించలేదు. తర్జనభర్జన పడుతోంది. అర్వింద్ మాత్రం ఇలా వన్‌సైడ్‌లో దూసుకుపోతున్నాడు. తన శత్రుశిబిరానికి నిరాశను మిగిల్చుతున్నాడు. వ్యతిరేకత ఎంతున్న కాలం కలిసి వచ్చిందిలే అని చంకలు గుద్దుకుంటున్నాడు అర్వింద్.