దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కాంగ్రెస్‌లో బీసీ బిగ్‌ ఫైట్‌ నడుస్తోంది. అంతర్లీనంగా బీసీ మంత్రం కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే జిల్లా నుంచి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మంత్రి పదవి కోసం అధిష్టానం వద్ద ఒత్తిడి పెంచుతున్నాడు. సీనియర్‌ ఎమ్మెల్యే , మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి కేబినెట్‌ విస్తరణలో అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. హోం శాఖ కూడా ఆయనకేనని పోర్ట్‌ఫోలియో కూడా డిసైడ్‌ చేసేసుకున్నారు అనధికారికంగా. కానీ అధిష్టానం వద్ద మహేశ్‌కుమార్‌ తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాడు తనకే మంత్రి పదవి కావాలని.

ఇదిలా ఉంటే ఎంపీ టికెట్‌ కోసం ఈరవత్రి అనిల్‌ కూడా అధిష్టానం వద్ద తనకున్న పరపతినంతా ఉపయోగించి తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నాడు. ఇప్పటికే ఇక్కడి నుంచి జగిత్యాల జీవన్‌రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. కానీ అనిల్‌ ఒత్తిడితోనే జీవన్‌రెడ్డి పేరును ఫస్ట్‌ లిస్టులో ప్రకటించలేదని తెలిసింది. జీవన్‌రెడ్డికి ఇస్తే మళ్లీ రెడ్డికే టికెట్‌ ఇచ్చారనే అపవాదుతో పాటు.. జీవన్‌రెడ్డికి అక్కడి రెండు నియోజకవర్గాలు తప్పితే ఇందూరు జిల్లాలోని ఐదింట్లో ఆయన కొత్త అభ్యర్థిగానే ట్రీట్‌ చేసే అవకాశం ఉంది. అందులోనూ నాన్‌లోకల్‌ కింద చూసే వీలుంది. దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు అనిల్‌. దీనికి తోడు బీఆరెస్‌, బీజేపీలు రెండూ కూడా మున్నూరుకాపులకు టికెట్లు అనౌన్స్‌ చేసి బీసీ జపం చేస్తున్నాయి. మరి రెడ్ల పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్‌ దాన్నే నిజం చేస్తూ జీవన్‌రెడ్డికి ఇస్తే బీసీలకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణను నిజం చేసినట్టవుతుంది.

దీంతో పాటు నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో పద్మశాలీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. పద్మశాలీలు బీజేపీ వైపు ఎక్కువగా మోల్డ్ అయి ఉన్నాయి. దీన్ని మార్చాలంటే పద్మశాలీ కులానికి చెందిన ఈరవత్రి అనిల్‌కు ఇస్తే ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌ వైపు మళ్లించవచ్చనే విళ్లేషణను అధిష్టానం ముందుంచుతున్నారు ఆ కులస్తులు. అనిల్‌ ఓసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. రెండు పర్యాయాలు ఓడినా.. మూడోసారి సీటు త్యాగం చేశాడు. ఢిల్లీపెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా అనిల్‌కు మాటిచ్చి ఉన్నాడు ఎన్నికల ముందు. తనకు కలిసివచ్చేలా వీటన్నింటినీ ఇప్పుడు ఎంపీ సీటు కోసం ఉపయోగించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు అనిల్‌.

You missed