దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
నగరం నడిబొడ్డున సుభాష్‌నగర్‌లో గతంలో వెయ్యి గజాల స్థలాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం పార్టీ ఆఫీసు కోసం స్థలాన్ని తీసుకున్నది. దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసుకున్నది. కానీ ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో దశాబ్దాలుగా అది ఖాళీగానే పడి ఉన్నది. సుభాష్‌నగర్‌లోని ఎస్ఎఫ్‌ఎస్ స్కూల్ పక్కనే ఎంతో విలువైన ఈ ప్రైమ్ ల్యాండ్‌లో ఇప్పుడు ఇంటెలిజెన్స్ శాఖ ఇది మాకు కేటాయించారని, బిల్డింగ్ నిర్మాణానికి ముగ్గు పోయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలుగు తమ్ముళ్లు గొడవకు దిగారు. ఇది మా పార్టీకి కేటాయించిన స్థలం.. మీరెలా కట్టుకుంటారని వారిని అడ్డుకున్నారు.
దీంతో విషయం రచ్చకెక్కింది. తెలుగుదేశం లీడర్లంతా కలిసి మండవ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మండవ రగంలోకి దిగాడు. కలెక్టర్‌తో మాట్లాడాడు. ఇది తెలుగుదేశం పార్టీకి కేటాయించిన స్థలమేనని, వేరొకరికి కేటాయించవద్దని కోరాడు. కానీ కలెక్టరేట్ వర్గాలు దీనిపై స్పందించలేదు. ఇన్నాళ్లు ఎందుకు కబ్జాలో లేరనే విషయాన్ని ప్రాతిపదికగా తీసుకుని, అదిప్పుడు సర్కార్ స్థలం.. ఎవరికైనా కేటాయించవచ్చనే విధంగా సమాధానం వచ్చింది. అయినా మండవ పట్టువదల్లేదు. దీన్ని ఎలాగైనా టీడీపీ పార్టీకే దక్కేలా చేసేందుకు తనవంతుగా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు.
గతంలో కూడా పలుసార్లు ఈ స్థలంపై వివాదం జరిగింది. ఆ తరువాత సద్దుమనిగింది. ఇన్నాళ్లకు ఇదే స్థలంపై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మండవ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉండటం.. ప్రభుత్వంలో పెద్దలతో పరిచయాలు ఉండటంతో ఎలాగైనా ఈ స్థలం టీడీపీ పార్టీకే దక్కేలా చేస్తారని తెలుగు తమ్ముళ్లు ఆయనపైనే భారం వేశారు.