దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ఎంతటి మార్పు. ఈనాడు, ఈటీవీ నుంచి అన్ని చానళ్లు మొన్నటి దాకా కేసీఆర్ పాట అందుకున్నవే. లైవ్‌లు గంటలు గంటలు ఇచ్చినవే. పేపర్ల నిండా వార్తలు కుమ్మరించినవే. అలా మీడియాను తన దొడ్లె కట్టేసుకున్నాడు కేసీఆర్. కానీ ఇవాళ పరిస్థితి పూర్తి భిన్నం. ఒక్క టీ న్యూస్‌లో తప్ప కరీంనగర్ కదనభేరీ వేరే టీవీ చానళ్లలో కనిపించలేదు. అలా కనిపించకుండా చెయ్యడానికి కాంగ్రెస్‌తో మంచి ప్లానింగే చేసుకున్నాయి ఇవన్నీ. కేసీఆర్ మాట్లాడే సమయానికి సరిగ్గా రేవంత్ ప్రోగ్రాం పెడుతున్నారు ఏదో ఒక చోట. మొన్న నల్లగొండ సభ ఉన్నప్పుడు చలో మేడిగడ్డ అంటూ పోలోమని కాంగ్రెస్ టీం అంతా పోయింది. ఇక్కడ కేసీఆర్ మాట్లాడేది రాలే. రేవంత్ మాట్లాడేది.. ఇంజినీర్లు మేడిగడ్డ డ్యామేజీ గురించి వివరించేది లైవ్ వచ్చింది. ఇప్పుడు కరీంనగర్ సభ.
మీడియా తనను దూరం పెట్టిందని కేసీఆర్‌కు అర్థమయిపోయింది. పార్టీని వీడి కొందరు పోతుంటే.. బీఆరెస్ పని ఖతమైందంటూ చానళ్లు ప్రచారం చేస్తున్నాయని తన కడుపులో మంటను బయటపెట్టుకున్నాడు కూడా ఈ వేదిక మీద. ఒక్క టీ న్యూస్ తప్ప వేరే చానళ్లు ఇక లైవ్ ఇవ్వడం మానేసినట్టే. ఈటీవీ, టీవీ9, వీ6 ఇవి కొంత బ్యాలెన్స్ పాటిస్తుండే. ఇప్పుడు అదీ లేదు. కేసీఆర్ లాగే రేవంత్ కూడా మీడియాకు యాడ్స్ కోసం విపరీతమైన డబ్బులు కుమ్మరిస్తున్నాడు. ఫుల్ పేజీల యాడ్లతో కుమ్మేస్తున్నాడు. సేమ్ టు సేమ్.. కేసీఆర్ పాలన చూసినట్టే ఉంది.
ఈ పరిస్తితి చూసే కేటీఆర్ యూట్యూబ్ చానళ్లు కుప్పలుతెప్పలుగా పెట్టించే ఆలోచనలో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌ను నమ్ముకోవడం లేదు. సోషల్ మీడియాలోనే బతుకుతున్నారు. అంతా చేంజ్ వచ్చింది మరి.