దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

పసుపుబోర్డు పేరు చెప్పి ఎంపీ అయ్యాడు. కానీ ఇప్పటి వరకు బోర్డు లేదు గీర్డు లేదు. పార్లమెంటు ఎన్నికల వేళ బోర్డు ఏర్పాటుకు ఓ ప్రకటన ఇప్పించేసి మళ్లీ ఎన్నికల్లోకి దిగాలనుకున్నాడు. అదేందో గానీ, అర్వింద్‌ ఈసారీ కాలం కలిసొచ్చింది. మార్కెట్లో విపరీతంగా పెరిగిన ధర అర్వింద్‌ నెత్తిన పసుపును గుమ్మరించింది. ఇక ఇదే మంచి సమయం అనుకున్నాడు అర్వింద్‌. ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. పసుపు ధర ఇంతలా పెరగడానికి నేనే కారణమన్నాడు. బ్రాండ్ అంబాసిడర్‌నని ప్రకటించుకున్నాడు.పనిలో పనిగా పసుపు రైతులంతా బీజేపీలో చేరండని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.

పాపం.. ! ఈ పరిణామాన్ని ఎలా ఖండించాలో..ఎలా అర్వింద్‌ను కౌంటర్‌ చేయాలో తెలియక బీఆరెస్‌, కాంగ్రెస్‌ శ్రేణులు నోరెళ్లబెట్టి చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అర్వింద్‌ మాత్రం పసుపు శాలువా కప్పుకుని రైతులకు , ఇందూరు ప్రజలకు ప్రవచనాలు ఇవ్వడం ప్రారంభించాడు. ఇంత వరకు పసుపు కోసం బీజేపీ ప్రభుత్వం, అర్వింద్‌ చేసిందేమీ లేదు. అప్పుడు ఎన్నికలప్పుడు హామీ తప్ప. సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దీంతో ఉన్న పసుపుకు రేటు వస్తుంది. అంతే. అది మా గొప్పే అంటూ జబ్బలు చరుచుకుంటున్నాడు అర్వింద్‌. అంతే కదా ఇందులో తప్పేం లేదు. ఇదో రాజకీయ అంశం. ప్రతిపక్షాలు సరిగా లేనప్పుడు, చేవ చచ్చి ఉన్నప్పుడు, తనకు సానుకూల వాతావరణాన్ని రాజకీయం చేసుకోవడంలో తప్పేం ఉంటుంది. అప్పుడు పసుపు అర్వింద్‌కు రాజకీయ భిక్ష పెట్టింది. ఇప్పుడు రెండోసారి ఎన్నికల్లో కూడా పసుపు ఇలా ఉపయోగపడుతున్నది.

You missed