దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్ మేయర్ దంపతులు నీతూ కిరణ్, దండు శేఖర్‌లు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 14న హైదరాబాద్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు ముగ్గుర బీఆరెస్ కార్పొరేటర్లు, టౌన్ నాయకులు కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. మేయర్ దంపతులు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు అత్యంత ఆప్తుడు. ఆయనే ఏరికోరి వీరికి మేయర్ సీటు ఇప్పించుకున్నాడు.
ఒక్కొక్కరుగా అంతా పార్టీని వీడుతూ వెళ్తున్న తరుణంలో మరో ఎనిమిది నెలల కాల వ్యవధి ఉన్న మేయర్ సీటును కాపాడుకునేందుకు కాంగ్రెస్ గూటికి చేరకతప్పని పరిస్థితి ఏర్పడింది వీరికి. పార్లమెంటు ఎన్నికల వేళ అర్బన్ నియోజకవర్గంలో అంతా ఖాళీ అవుతున్నా మాజీ ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ కవిత గానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో పార్టీ మొత్తం అస్తవ్యస్తంగా తయారయ్యింది. ఎన్నికలు జరిగే సమయానికి మొత్తం ఖాళీ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా ఉంది పార్టీ పరిస్థితి. నాయకుల తీరు.