దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

—————————————————————–

కామారెడ్డిలో కేటీఆర్‌ స్పీచ్‌ బాగా మెచ్యూరిటీగా అనిపించింది. అందరూ తిట్టంగ తిట్టంగ బాగనే మారిండని కూడా అనిపించింది. సీఎం రేవంత్‌రెడ్డి భాషపై బాగనే మాట్లాడిండు. హితవు పలికిండు.ఇవేం మాటలు హుందాగా మాట్లాడు అని హితబోధ కూడా బాగనే ఉంది. ‘పేగులు మెడలో వేసుకుంటానన్నాడు నువ్వేమన్నా బోటి కొట్టేటోనివా..? గొర్రె కసాయోడినో నమ్ముతుంది..’ మాటలు నీలోని అహంకారాన్ని ఇంకా ఇలా బయటపెడుతూనే ఉన్నాయని చెప్పకనే చెప్పాయి. స్పీచ్‌ అంతా ఓకే. అంతా రొటీన్‌. కాస్త ఓపిగ్గా చెప్పినట్టనిపించింది. కార్యకర్తలకు బూస్టింగ్‌ ఇచ్చే పనిలో కొంత సక్సెసయ్యాడు కూడా. కానీ కొండంత రాగం తీసి… అన్నట్టుగా చివరలో సోయితప్పి మళ్లా సొల్లు మాటలే చెప్పాడు. మనం స్వల్ప ఓట్లతో ఓడిపోయామన్నాడు. ఓకే బాగనే ఉంది. కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమికి కారణం క్యాడర్, లీడర్‌ కానేకాదన్నాడు. సరే ఇప్పుడు తప్పులెన్ని ఎవర్నేమి చేసేదుందిలే అని అలా అని ఉంటాడనిపించింది.

ఓ మీడియా ఇంటర్వ్యూలో రేవంతే స్వయంగా ఓ మాట చెప్పాడట. ఏమని…? జనాలు మోసపోవాలనే చూస్తరు.. మోసం చేస్తేనే మనం గెలుస్తామని అన్నాడట. అందుకే నిజాయితీగా మోసం చేశాడు… గెలిచాడు… అని ముక్తాయించాడు. అంతే కాదు.. అలా మోసం చేసే వారినే ప్రజలు నమ్ముతారు. మమ్మల్నెందుకు నమ్ముతారు.. అన్నాడు. అంతకు ముందు మేం తెలంగాణ తెచ్చినం.. అందుకే పదేండ్లు మమ్మల్ని నమ్మారు అన్న కేటీఆర్‌.. ఆ వెంటనే ఇలా మాట మార్చాడు. అంటే మీరు కూడా జనాన్ని మోసం చేసి పదేండ్లు పాలించారా..? లేక మోసపోయి జనాలు మీకు రెండు సార్లు అధికారం కట్టబెట్టారా..? మాటకు మాటకు పొంతన లేకుండా కేటీఆర్‌ ఇలా మాట్లాడటం అతనిలో ఇంకా అధికారం పోయిన బాధ, ఫ్రస్టేషన్ పోయినట్టుగా లేదు.

అందుకే ఇలా మాటమతి తప్పుతోంది. సేమ్‌.. ఇవే మాటలు ఆ మధ్య కేసీయార్‌ కూడా అన్నాడు. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుకు ఓట్లేశారని… జనం తీర్పును తప్పుబట్టినన్ని రోజులు లీడర్‌గా మీలో పరివర్తన రాలేదనే అర్థం. ఇంకా మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉందనే మీనింగ్‌. మీ మెచ్యూరిటీ ఇంకా మీ ఇంటి గచ్చు కూడా దాటలేనేది సుస్పష్టం. జనాన్ని తక్కువ చేసి చూసినోడు ఎప్పుడూ రాజకీయంగా అథఃపాతాళంలోనే ఉంటాడనేది చరిత్ర చెప్పే సత్యం …! కేటీఆర్‌ ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉందనే విషయం కామారెడ్డికొచ్చి చెప్పిపోయినట్టుంది ఆ మీటింగు.

You missed