దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ఒక నియోజకవర్గానికి ఒకరు ఇన్చార్జిగా ఉంటారు. ఓడిన ఎమ్మెల్యేనే ఇన్చార్జిగా ప్రటించింది కూడా బీఆరెస్ అధిష్టానం. కానీ కామారెడ్డిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. ఏకంగా ఇక్కడ తొమ్మిది మంది ఇన్చార్జిలుగా ఉంటారు. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును..! కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ మీద అక్కడ లోకల్ లీడర్లకు ఎవరికి గురి లేదు. నమ్మకమూ లేదు. పార్టీని భ్రష్టు పట్టించాడనే ఫిర్యాదులు చాలానే చేశారు. చాల సార్లు వీరి మధ్య ఉన్న విభేదాలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే బయటపడ్డాయి కూడా.
ఇదిలా ఉంటే చాలా రోజులుగా ఇన్చార్జిగా ఎవరిని ఉంచాలా..? అనే దానిపై ఊగిసలాట జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేకు ఇస్తారా..? ఇవ్వరా..? అనే అనుమానాలు ఉండేవి. నిట్టు వేణుగోపాల్ తనకు ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేశాడు.కవిత వద్ద మొర పెట్టుకున్నాడు కూడా. ఆదివారం జరిగిన కేటీఆర్ మీటింగులో దీనిపై క్లారిటీ వచ్చింది. ఇన్చార్జిగా గంప గోవర్దన్‌కు ఇస్తూనే.. సమన్వయ కమిటీని కూడా గంపకు లింకు పెట్టాడు కేటీఆర్. సమన్వయ కమిటీలో తిర్మర్‌రెడ్డి, నిట్టు వేణుగోపాల్, నర్సింగరావు, ముజీబుద్దీన్.. ఇలా ఎనిమిది మంది ఉన్నారు. అంటే గంపతో కలిసి మొత్తం తొమ్మిది మంది అన్నమాట. అంటే.. గంప గోవర్దన్ ఏ నిర్ణయం సింగిల్‌గా తీసుకోలేడన్నమాట.ఏం చేయాలన్నా. వీరిందరి నోటీసులో పెట్టి.. వారి ఆమోదం మేరకు ముందుకు పోవాలని కేటీఆర్ సూచించాడు.
పాపం..! గంప..!! మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడి పరిస్థితి ఇలా అయ్యింది అక్కడ. ఇదిలా ఉంటే.. ఇన్చార్జిగా గంప పేరు ప్రకటించినందుకు నిట్టు వేణుగోపాల్ బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యాడట.