దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిపై అవిశ్వాసం పెట్టారు. ఓకే. పరీక్షకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇదీ ఓకే. కాబోయే చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి సారథ్యంలో 14 మంది డైరెక్టర్లు క్యాంపులో ఎంజాయ్ చేస్తున్నారు. ఇదీ కూడా ఓకే.అంతా బాగనే ఉంది కదా.. మరేమైంది అంటారా..? ఇందులో కొత్త ట్విస్ట్ ఏంటంటే భాస్కర్‌రెడ్డి రాజీనామా. అవును ఆయనెప్పుడు రాజీనామా చేస్తాడా అని ఎదురుచూస్తున్నాడు రమేశ్‌రెడ్డి. పనిలో పని కొన్ని మీడియా చానళ్లలో, లోకల్ పత్రికల్లో భాస్కర్‌రెడ్డి రాజీనామా కూడా చేసేశాడనే వార్తలు రాయించేశారు. వాస్తవానికి భాస్కర్‌రెడ్డి ఇంకా రాజీనామా చేయలేదు.
ఈనెల 21 అవిశ్వాస పరీక్షకు ముహూర్తం పెట్టారు ఆఫీసర్లు. మరి ఎందుకీ రాజీనామా అంశం తెరమీదకు వచ్చింది..? ఖర్చు తప్పించుకోవడానికట. అవును..! వైస్ చైర్మన్‌గా ఉన్న కుంట రమేశ్‌రెడ్డిని చైర్మన్ చేస్తారు. అందుకే ఆయనే అంతా ఖర్చు పెట్టుకుని మరీ డైరెక్టర్లందరినీ కర్ణాటకా, గోవా తిప్పుతున్నాడు.
ఒక్కొక్కరికి ఐదు లక్షలు మాట్లాడుకుని, అందులో మూడు ముట్టజెప్పాడట.. మరో రెండు తంతు ముగిసిన వెంటనే ఇచ్చేస్తానన్నాడట. కానీ ఈ మధ్యలో తిరుగుడు, తినుడు, తాగుడు ఖర్చులే తడిచి మోపడవుతున్నాయట. బాబ్బాబు జెర ఆ రాజీనామా ఒకటి చేసి ఇలా మా ముఖం మీద పడేయరాదు అనే రేంజ్‌లో కాబోయే చైర్మన్ ఎదురుచూస్తుండగా.. నేనెందుకు చేయాలె..? చైర్మన్ కావాలనుకుంటున్నావుగా.. తిప్పు.. తినిపించు.. తాగిపించు… తీయ్.. ఎప్పుడూ తీసే అలవాటు లేదుకదా.. ఇప్పుడన్నా తీసి బాగా ఖర్చు పెట్టు అనే విధంగా ఈయన గారు బెట్టు చేస్తున్నాడట. ఇలా నడుస్తోంది డీసీసీబీ అవిశ్వాస ఘట్టం. అందులో రాజీనామా అంశం భలే సస్పెన్స్ క్రియేట్ చేస్తుందండోయ్.
ఏమాటకామాటే… క్యాంపులో ఉన్న డైరెక్టర్లు కూడా భాస్కర్‌రెడ్డి రాజీనామా చేయకపోతే బాగుండు… ఇంకా మిగిలిన పది రోజులు మస్తు ఎంజాయ్ చేసి వస్తం.. లేకపోతే క్యాంపు ముగింపు అర్థం లేకుండా పోతుందని తెగ ఇదైపోతున్నారట.