దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

ఇందూరు బీఆరెస్‌ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డాడు అధినేత కేసీఆర్‌. ముంచుకొస్తున్న ఎంపీ ఎన్నికల లోపే జిల్లాలో పార్టీని బలంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా నియోజకవర్గ ఇన్‌చార్జిలను మార్చే యోచనలో ఉన్నాడు. మూడు సార్లు సిట్టింగులకే టికెట్లు ఇచ్చి ఘోర పరాభవం మూటగట్టుకున్న బీఆరెస్‌… ఇప్పుడు తప్పు తెలుసుకుని దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నది. సిట్టింగులపై పార్టీలో కాదు, ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మొన్న ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పార్టీ నియోజకవర్గాల వారీగా ఆందోళనలకు పిలుపునిస్తే ఆర్మూర్‌, బోధన్‌, అర్బన్‌ నియోజకవర్గాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. దీనిపై కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నాడు.

తర్వలో బీఆరెస్‌ నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థిని ప్రకటించేందుకు రంగం సిద్దమయ్యింది. ఈ నేపథ్యంలో పార్టీని ఇంత దీనావస్థలో ఉంచి పోటీకి దిగితే మరింత ఘోర ఓటమి తప్పదని తెలుసుకున్నాడు కేసీఆర్‌. అందుకే రోగం ఎక్కడో మందు అక్కడే వేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఓడిన ఎమ్మెల్యేలకే నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వారిని మారుస్తున్నాడు. బోధన్‌ నుంచి ఈ ప్రక్రియ షురూ అయ్యింది. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి ఆయేషా ఫాతిమాకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించనున్నారు. మైనార్టీ కోటాలో వీరిని కాదని ఇప్పుడు వేరొకరికి ఇచ్చే వీలు లేదు. దీనికి తోడు షకీల్‌ కన్నా ఆయన సతీమణికే అంతో ఇంతో కాస్త మంచి పేరుంది. ట్రస్ట్‌ పేరుతో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేసి ఉన్నారామె. ఆమెను ఇన్చార్జిగా ప్రకటించనున్నారు.

ఇక ఆర్మూర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే చేతులెత్తేశాడు. అక్కడి బీఆరెస్‌ నేతలకు బాహాటంగానే చెప్పేశాడట ఇక నేను రానని. ఆర్మూర్‌లో రాజ్యసభ సభ్యడు కేఆర్‌ సురేశ్‌రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్బన్లో కూడా పార్టీ పూర్తిగా చతికిలబడి పోయింది. బిగాల గణేశ్ గుప్తా పార్టీ క్యాడర్‌ను కాపాడుకోలేకపోయాడనే అభిప్రాయంతో అధిష్టానం ఉంది. దీంతో అతని తమ్ముడు మహేశ్‌ బిగాలకు ఇన్చార్జి ఇస్తే ఎలా ఉంటుంది..? ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే విషయంలో కేసీఆర్‌ సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. రూరల్‌లో బాజిరెడ్డి జగన్‌కు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించనున్నారు.

జిల్లా అధ్యక్షుడి మార్పూ తథ్యమే..

బీఆరెస్‌ నిజామాబాద్‌ జిల్లా అద్యక్షుడు మార్పు అనివార్యమైంది. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జిల్లా రాజకీయాలకు దాదాపుగా గుడ్‌ బై చెప్పినట్టే. దీంతో ఇక్కడ ఎవరిని నియమించాలనేదానిపై కసరత్తు జరుగుతోంది. ఎంపీ ఎన్నికలకు ముందే అధ్యక్షుడి ఎన్నిక కూడా చేయాలని యోచిస్తున్నారు. బీసీకే అధ్యక్ష పీఠం ఇవ్వాలని మాత్రం క్లారిటీతో ఉన్నారు.

You missed