దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

డీసీసీబీ అవిశ్వాస పరీక్ష పంచాయితీ సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లింది. చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డిని దించేసి వైస్‌ చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డికి చైర్మన్‌ గిరీ అప్పగించేందుకు సుదర్శన్‌రెడ్డి చక్రం తిప్పాడు. దీనికి సంబంధించిన కసరత్తంతా దాదాపు పూర్తయ్యింది. ఈనెల 21 అవిశ్వాస పరీక్ష ఉంటుందని అధికార వర్గాలు డేట్‌ను కూడా ప్రకటించారు. ఆలోపు 14 మంది డైరెక్టర్లను క్యాంపుకు తరలించాడు రమేశ్‌రెడ్డి. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో బస చేస్తుండగా.. ఆ తరువాత గోవాకు వీరిని తరిలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పార్టీ సీనియర్లు రమేశ్‌రెడ్డిని చైర్మన్‌ చేయడం పై గుర్రుమంటున్నారు.

బీఆరెస్‌కు చెందిన చైర్మన్‌ను దించేసి మళ్లీ బీఆరెస్‌ నేతకే ఎందుకు చైర్మన్‌ ఇవ్వాలి..? అనేది వారి ప్రధాన అభ్యంతరం. కాంగ్రెస్‌ డైరెక్టర్లెవరూ లేరా..? అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నారు. సుదర్శన్‌రెడ్డి నిర్ణయాన్ని పూర్తిగా తప్పుబడుతున్నారు. బంధువైనంత మాత్రాన చైర్మన్‌ను చేయాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడి, నిబద్దతతో ఎంతో మంది నేతలు ఉన్నారని, వారిలో ఒకరిని గుర్తించి చైర్మన్‌ చేయాలనే వాదన వినిపిస్తోంది. జిల్లా పార్టీకి చెందిన సీనియర్ నేతలంగా రమేశ్‌రెడ్డి విషయంలో తీవ్రంగా ఆటంకం తెలుపుతున్నారు. అటుఇటూ పోయి చివరకు ఈ పంచాయితీ సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లింది.

ఓ వైపు క్యాంపు రాజకీయాలు నడుస్తుండగా.. ఈ కొత్త పంచాయితీ పుట్టుకురావడంతో పార్టీలో తీవ్ర చర్చకు తెర తీసింది. డైరెక్టర్ల క్యాంపు ఖర్చు రమేశ్‌రెడ్డికే సాధ్యమవుతుందా..? కాంగ్రెస్‌ డైరెక్టర్లు పెట్టుకోరా..? అనే చర్చ కూడా తీసుకొచ్చారు. అధికారికంగా అవిశ్వాస పరీక్షకు ముహూర్తం ఖారారైన తరువాత ఈ కొత్త రగడ మొదలు కావడంతో ఆరోజున ఏం జరుగుతుందో తెలియని పరిస్తితి నెలకొన్నది.

 

You missed