దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
బాజిరెడ్డి గోవర్దన్ తమ లోక్‌సభ నుంచి పోటీ చేస్తే గెలిపించుకుంటామంటున్నారు జహీరాబాద్ లోక్‌సభ ప్రతినిధులు, మున్నూరుకాపు సంఘం నాయకులు. ఇప్పుడిదో కొత్త డిస్కషన్. నిజామాబాద్ పార్లమెంటు నుంచి కవిత పోటీకి సుముఖంగా లేదు. ఎవరిని పోటీలో నిలపాలని యోచిస్తున్న సమయంలో కేసీఆర్ దృష్టి బాజిరెడ్డి గోవర్దన్‌పై పడింది. మాస్ లీడర్, బీసీ నేత, మున్నూరుకాపుల నుంచి సపోర్టు.. ఇవన్నీ మంచి అవకాశాలుగా ఆ పార్టీ నేత భావించాడు. దీంతో నిజామాబాద్ లోక్‌సభ నుంచి దాదాపుగా బాజిరెడ్డి గోవర్దన్ పేరు ఖరారైనట్టే. రేపో మాపో అధినేత నోటి వెంట ఈ పేరు డిక్లేర్ కూడా చేయనున్నారు.
ఈ నేపథ్యంలో మరో కొత్త పంచాయితీ వచ్చి పడింది. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బాజిరెడ్డి పేరు డిక్లేర్ చేస్తే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే కొత్త వాదన ఇప్పుడు అధినేత ముందుకు వచ్చింది. జహీరాబాద్ లోక్‌సభ నుంచి బీఆరెస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అతని పేరే బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది కూడా. మరోవైపు కాంగ్రెస్ నుంచి సురేశ్ షెట్కార్ పేరే ఖరారయ్యే అవకాశం ఉంది. వీరిద్దరూ లింగాయత్ కులానికి చెందిన వారే. ఇద్దరు లింగాయత్‌లో పోటలో ఉంటే మధ్యలో బాజిరెడ్డి పోటీలో ఉంటే ఈ లోక్‌సభలో అత్యధికంగా ఉన్న మున్నూరుకాపుల ఓట్లు వన్‌సైడ్ పడి బీఆరెస్ గెలుపుకు అవకాశం సులువుగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా బీఆరెస్ అధినేత ముందుకు వస్తున్నాయి.
జహీరాబాద్ నుంచి పోచారం తనయుడు, డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నాడు. దాదాపుగా అధిష్టానం కూడా ఈ పేరును డిక్లేర్ చేసే యోచనలో ఉన్నట్టు ప్రచారం కూడా ఊపందుకున్నది. ఈ క్రమంలో పొలిటికల్ ఈక్వేషన్లు మారుతున్నాయి. ఇకవేళ బాజిరెడ్డిని జహీరాబాద్ నుంచి ఓకే చేస్తే మరి.. భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏంటీ..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అవసరమైతే భాస్కర్‌రెడ్డి నిజామాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేయిస్తే సరిపోద్ది కదా..! అనే ముక్తాయింపు కూడా వినబడుతోంది.