దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
అత్యంత దగ్గరి బంధుత్వం. అంతకుమించి ఇద్దరి మధ్య ప్రాణస్నేహం. ఒకే కంచంలో తిన్న రోజులు. రాజకీయంగా ఎదిగేక్రమంలో తనవంతు సాయం ఒకరిస్తే.. వ్యాపారపరంగా అన్ని అండదండలిచ్చే తోడ్పాటు మరొకరిది. ఒకరుంటే అక్కడ మరొకరుండాల్సిందే. అది రాజకీయ కార్యక్రమమైనా.. శుభకార్యమైనా. ఇద్దరి మధ్య స్నేహం కొందరికి కంటగింపుగా మారింది. విమర్శలను ఎదుర్కొన్నది. కానీ ఇద్దరూ పట్టించుకోలే. కావాల్సింది చేసుకుంటూ పోయారు. అనుకున్న ప్రకారం ముందుకు సాగారు. కానీ కాలం మారింది. పరిస్తితులు భిన్నంగా మారాయి. అధికారం పోయింది. ఆలోచనలూ మారాయి. ఆ ప్రాణస్నేహం విడిపోయింది.
బంధుత్వం, ఆత్మీయత పక్కన పెట్టి మళ్లీ అధికారం వైపు ఓ స్నేహం… స్నేహితుడి ‘హస్తం’ వదిలింది. హస్తం గూటికి చేరింది. ఇప్పుడు చెప్పిన ఉపోద్ఘాతమంతా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, కుంట రమేశ్‌రెడ్డిల గురించి. మంత్రిగా ఉన్న సమయంలో ప్రశాంత్‌రెడ్డి తన నియోజకవర్గంలోని కాంట్రాక్టు పనులన్నీ రమేశ్‌రెడ్డికే అప్పగించాడు. వందల కోట్ల పనులు జరిగాయి. బిల్లులు కూడా ఆగలే. తన పరపతిని ఉపయోగించి ప్రశాంత్‌రెడ్డి క్లియర్ చేపించాడు. డీసీసీబీ వైస్ చైర్మన్‌గా రమేశ్‌రెడ్డికి ఇప్పించుకున్నాడు ప్రశాంత్. అంతా బాగానే ఉంది. కష్టకాలం వస్తే గానీ ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు కాదో తెలిస్తుంది. అట్లనే అయ్యింది.
రమేశ్‌రెడ్డికి రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులతో పాటు బాల్కొండ నుంచి ఓడిన సునీల్‌రెడ్డి కక్షసాధింపు రమేశ్‌రెడ్డికి ఊపిరిసలపనీయలేదు. మరోవైపు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి.. రమేశ్‌రెడ్డికి దగ్గరి బంధువు. రా వచ్చేయ్ మన పార్టీకి అని ఆహ్వానించాడు. రాజకీయ ఇబ్బందుల్లేకుండా నేను చూసుకుంటానన్నాడు. పనిలో పనిగా డీసీసీబీ చైర్మన్ గిరీని కూడా కానుకగా ఇస్తానన్నాడు. ఇక రమేశ్‌రెడ్డి … ప్రశాంత్‌రెడ్డి స్నేహానికి గుడ్ బైచెప్పాడు. ఇప్పుడు హస్తం గూటికి చేరి క్యాంపు రాజకీయాల్లో కీలకంగా మారాడు. త్వరలో ఆయన డీసీసీబీ చైర్మన్ కానున్నాడు. అధికారం లేకుంటే ఉండలేము.. భరించలేము… బతకలేము అనే కేటగిరీలో తానూ చేరాడు. తానేమీ మినహాయింపు కాదని నిరూపించుకున్నాడు.
ఇంత దగ్గరి మిత్రుడు, బంధువు అలా ఎలా పార్టీ మారాడబ్బా..? అని పార్టీలోనే డిస్కషన్ జరిగినా.. అదీ ఏ కొద్ది రోజులే. మళ్లీ అంతా మరిచిపోతారు. బెల్లం ఉన్న చోటకి ఈగలు చేరినట్టు… అధికారం అంటే అంతే మరి. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు.. అంటే ఇద్దరి ప్రాణ స్నేహితుల్ని విడగొడతా అని సమాధానమిచ్చిందట. ఇక్కడ అధికారం కూడా అదే చేసింది. అదే ఇప్పటి లోకంతీరు. ఇది కొత్తేం కాదు. వింత అసలే కాదు. జస్ట్ డిస్కషన్ టాపిక్ అంతే. పెద్దగా ఫీల్‌కావాల్సిన పనీలేదు.