దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి:

ఎప్పుడెప్పుడా అని పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ సీనియర్‌ నేతలందరికీ ‘పార్లమెంటు’ పరీక్ష పెట్టింది అధిష్టానం. ఎంపీ ఎన్నికలకు ముందే పదవులు వరిస్తాయని మరింత జోష్‌తో పనిచేయవచ్చని నేతలు భావించారు. కానీ ఊరించి ఊరించి అధిష్టానం దీన్ని పెండింగ్‌లో పెట్టేసింది. మంత్రి పదవి మొదలు కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ల వరకు అన్నీ పార్లమెంటు ఎన్నికల తరువాతనే అని చెప్పకనే చెప్పింది. నిజామాబాద్‌ ఎంపీ సీటును ఎలాగైన కైవసం చేసుకునేలా కాంగ్రెస్ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నది. ఇందులో భాగంగా వలసలు ఎంత మంది వచ్చినా ఇదే మంచి తరుణమని ఆహ్వానిస్తోంది. ఎంపీ ఎన్నికల తరువాత వలసలకు బ్రేక్‌ పడనుంది. దీంతో కాంగ్రెస్‌లో చేరేందుకు ఇదే మంచి సమయని అంతా రెడీ అవుతున్నారు. దాదాపుగా బీఆరెస్‌లో కీలక నేతలంతా కాంగ్రెస్‌ గూటికి చేరే చాన్స్‌ ఉంది. బీజేపీని టార్గెట్ చేసి కాంగ్రెస్‌ మాటల దాడులు పెంచుతోంది. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం ఈ రెండు పార్టీలకు రాజకీయంగా కీలకంగా మారింది. ఒకరికి మించి మరొకరు పోటీలు పడి మరీ దీన్ని తెరిస్తామంటూ మీటింగులు పెట్టుకుంటున్నారు. మాటల దాడులు కూడా ఒకరిపై మరొకరు తీవ్రతరం చేసుకుంటున్నారు.

  • సుదర్శనుడికి అగ్ని పరీక్ష..

మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి ఈ ఎంపీ ఎన్నికలు అగ్ని పరీక్షే కానున్నాయి. మంత్రి పదవి కచ్చితంగా వస్తుందనే సంకేతాలున్నా.. దానికి ముందు కాంగ్రెస్‌ అధిష్టానానికి నిజామాబాద్‌ ఎంపీ సీటు గెలిపించి కానుకగా ఇవ్వాలనే షరతు ఆయనకు తీవ్ర ఆందోళననే క కలిగిస్తున్నది. అందుకే ఆయన జిల్లాలో ఇతర పార్టీల నుంచి నేతలెవరూ వచ్చినా అంతా తానై వ్యవహరిస్తున్నాడు.అందరికీ హామీ ఇస్తున్నాడు. పార్టీలో చేర్చుకునేందుకు అన్ని దారులు తెరిచి ఉంచాడు. అయితే పార్టీలో చేరండి.. లేదా అవిశ్వాసం పెడతామనే దోరణి కూడా కాంగ్రెస్‌ పార్టీలో కనిపిస్తున్నది. ఎలాగైనా నిజామాబాద్‌ ఎంపీ సీటు గెలిపించి ఇస్తే మర్యాదపూర్వకంగా మంత్రి పదవిని తీసుకోవచ్చనే భావనలో ఉన్న సుదర్శన్‌రెడ్డి తన వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా పనిచేస్తున్నాడు.

ఆశల పల్లకీలో సీనియర్‌ నేతలు..

అర్బన్‌, రూరల్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి పదవులు ఆశిస్తున్న సీనియర్‌ నేతల సంఖ్య బాగానే ఉంది. వీరంతా తమకు ఎంపీ ఎన్నికలకు ముందే ఏదో ఒకటి వస్తుందని భావించారు. కానీ అందరినీ ఎంపీ ఎన్నికల్లో బాగా పనిచేయించుకునేందుకు పదవుల పందేరాన్ని పెండింగ్‌లో పెట్టేసింది అధిష్టానం. అర్బన్‌ నుంచి కేశవేణు, గడుగు గంగాధర్‌, నరాల రత్నాకర్‌, ధర్మపురి సంజయ్‌, తాహెర్‌బిన్‌ హందాన్‌, బాల్కొండ నుంచి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, రూరల్ నుంచి అరికెల నర్సారెడ్డి, నగేశ్‌రెడ్డి, ముప్ప గంగారెడ్డి, శేఖర్‌గౌడ్‌, అంతిరెడ్డి రాజిరెడ్డి ..ఇలా చాలా మందే తమకు ఏదో ఒక కార్పొరేషన్‌ పదవి కావాలని ఆశిస్తున్నవారే. నుడా చైర్మన్‌ కోసం కూడా కర్చీఫ్‌ వేసి కూర్చున్నారు. నిజామాబాద్‌ మార్కెట్ కమిటీ పైనా నజర్‌ పెట్టారు. ఎవరికి వారే ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. ఎవరికి ఏం ఇస్తారో తెలియదు కానీ అందరికీ ఆశ చూపుతోంది అధిష్టానం.ఎలాగైనా ఎంపీ సీటును గెలిచిరండి.. అందరికీ సముచిత ప్రాధాన్యత ఉంటుందనే సిగ్నల్‌ ఇచ్చేశాడు సీఎం రేవంత్‌రెడ్డి.

వర్కింగ్ ప్రెసిడెంట్‌కూ ఇజ్జత్ కా సవాల్‌..

ఇక్కడి నుంచి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఉండడం, అధిష్టానం ఆయనకు మొన్ననే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఎంపీ సీటు గెలుపుపై ఆశలు పెరిగాయి అధిష్టానానికి. ఇది కూడా మహేశ్‌కు ఇజ్జత్‌కా సవాల్‌గా మారింది. ఎంపీ ఎన్నికల తరువాత ఆయనను టీపీసీసీ ప్రెసిడెంట్‌గా చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన కాలికి బలపం కట్టుకుని నిజామాబాద్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నాడు. మీటింగులకు హాజరవుతున్నాడు. మాటల దాడి పెంచుతున్నారు. అర్వింద్‌ టార్గెటెడ్‌గా బీజేపీని డమ్మీ చేసి కాంగ్రెస్‌ను ఓవర్‌ టేక్‌ చేసేలా ఎత్తులు వేస్తున్నాడు.

 

You missed