మళ్లీ బాండుపేపర్లు రాస్తాడు.. అబద్దాల హామీలిస్తాడు.. నీకూ కవిత గతే పడుతుంది.. అర్వింద్‌పై విరుచుకుపడ్డ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. బీజేపీని ఓవర్‌టేక్‌ చేస్తున్న కాంగ్రెస్‌.. రంగంలోకి దిగిన మహేశ్‌.. మున్సిపల్ బడ్జెట్ సమావేశాలకు హాజరు.. బల్దియాపై పట్టుకు యత్నం.. బీజేపీ స్పీడ్‌కు కళ్లెం.. ఓ వైపు వలసలు.. మరోవైపు మాటల దాడులు.. అర్వింద్‌ను డిఫెన్స్‌లో పడేసే యత్నం.. ఇందూరును స్మార్ట్‌ సిటీ చేయలేకపోయావెందుకు..? మతం ముసుగులో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తావ్‌…? అర్వింద్‌ తీరుపై నిలదీతల పర్వం.. అర్వింద్‌ను బట్టలిప్పి కొడతామన్న డీసీసీ ప్రెసిడెంట్‌ మానాల మోహన్‌రెడ్డి..

ByDandugula Srinivas

Feb 22, 2024

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకున్నది. అభ్యర్థులెవరో ప్రకటించకున్నా.. ఎవరికి వారే వారి మాటలతో క్లారిటీ ఇచ్చేసుకున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అర్వింద్‌కే మళ్లీ అవకాశం ఇస్తారని తేలిపోయింది. కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డికి టికెట్‌ కన్ఫాం అయినట్టే. ఇక పొలిటికల్ ఫైటింగ్‌ షురూ అయ్యింది. రంగంలోకి మహేశ్‌కుమార్‌ గౌడ్‌ దిగాడు. అర్వింద్ అంతు తేల్చేందుకు నడుం బిగించాడు. తొలిసారిగా ఆయన మున్సిపల్ బడ్జెట్‌ సమావేశానికి హాజరై బల్దియాపై కాంగ్రెస్‌ పట్టు కోసం పై చేయిగా నిలిపేందుకు యత్నించాడు. బీజేపీని ఓవర్‌ టేక్‌ చేశాడు. నగరంలో అర్బన్‌ ఎమ్మెల్యేగా ధన్‌పాల్‌ ఉన్నాడు. బీజేపీ బలంగా ఉంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లను కాంగ్రెస్‌లోకి గుంజారు. కాంగ్రెస్‌ బలం పెంచుకుంటున్నది. రేపో మాపో మేయర్‌ను కూడా కాంగ్రెస్‌ లాగనుంది. ఈ క్రమంలో తొలిసారిగా అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ హోదాలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు. మీటింగ్‌ అంతా మహేశ్‌ ఒంటిచేత్తో నడిపి కాంగ్రెస్‌ ప్రాబల్యం చాటేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు. ఆ తరువాత కాంగ్రెస్‌ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో అర్వింద్‌పై నిప్పులు చెరిగాడు మహేశ్‌.

కవితకు పట్టిన గతే పడుతుంది నీకు…

అర్వింద్‌ మళ్లీ బాండు పేపర్లు రాసేందుకు రెడీ అయ్యాడని మహేశ్‌ సంచలన కామెంట్‌ చేశాడు. గతంలో పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండుపేపర్‌ రాసిచ్చి ఈ ఐదేండ్లు రైతులను మోసం చేశాడన్నాడు. ఎన్నికల ముందు పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని మాటిచ్చారని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదని దుయ్యబట్టాడు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు విషయాన్ని ఇన్ని రోజులు విస్మరించి ఇప్పుడు హడావుడి ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం కూడా మోసంలో ఓ భాగమేనన్నాడాయన. అసలు ఇన్నేండ్ల నుంచి సిటీకి ఏం చేశాడు.. అర్వింద్‌..? అని కడిగిపాడేశాడు. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ జాబితాలోకి వచ్చింది. మరి రాష్ట్రంలోనే హైదరాబాద్‌, వరంగల్‌ తరువాత మూడోస్థానంలో నిలిచిన నిజామాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌కు స్మార్ట్ సిటీ హోదా ఎందుకు రాలేదు..? నువ్వు చేసిన ఘనకార్యమిదేనా..? ఎన్ని నిధులు తెచ్చావ్‌.. ? జిల్లాను ఏం అభివృద్ది చేశావ్‌..? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. నిలదీతల పర్వంతో కడిగేశాడు. కవితకు పట్టిన గతే పడుతుందని కూడా అర్వింద్‌ ఫ్యూచర్ చెప్పేశాడు. మతం పేరు చెప్పి, దేవుళ్ల పేరు చెప్పి ఎంతో కాలం ప్రజలను మోసంచేయలేరని, మతం, కులం వ్యక్తిగతమని, మేమూ దేవుళ్లకు పూజలు చేస్తామని, అన్ని మతాలను గౌరవిస్తామని, కానీ ఇప్పటి వరకు మతం, దేవుళ్ల పేరుతో కాంగ్రెస్‌ ఓట్లడుక్కులేదన్నాడు మహేశ్‌.

బీజేపీని ఓవర్‌ టేక్‌ చేస్తున్న కాంగ్రెస్‌..

జిల్లాలో బీజేపీ అంతోఇంతో బలంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో అర్బన్‌, ఆర్మూర్‌ … రెండు నియోజకవర్గాలు గెలుచుకోవడంతో పాటు నిజామాబాద్‌ రూరల్‌లో కూడా గణనీయమైన ఓట్లు సాధించింది. దీంతో పార్లమెంటుతో తమ ప్రత్యర్థి బీజేపీనేనని కాంగ్రెస్‌ క్లారిటీకి వచ్చింది. అందులో భాగంగానే సీనియర్‌ నేత మహేశ్‌కు కీలకమైన ఎమ్మెల్సీ ఇచ్చింది.పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూడా మహేశ్‌ జిల్లా రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యాడు. బీజేపీని కాంగ్రెస్‌ ఓవర్ టేక్‌ చేసేలా మహేశ్‌ స్వయంగా రంగంలోకి దిగాడు. అర్వింద్‌ను టార్గెట్ చేశాడు. నిలదీతల పర్వాన్ని స్టార్ట్ చేశాడు.

ఓవైపు వలసలు.. మరోవైపు మాటల దాడులు..

కాంగ్రెస్‌ బలం పుంజుకుంటోంది. వలసలకు ఆహ్వానం పలుకుతోంది. జిల్లా సీనియర్ లీడర్‌, మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి పెద్దన్న పాత్రను అప్పగించాడు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పటికే మార్క్‌ఫెడ్ చైర్మన్‌ మార గంగారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, త్వరలో మేయర్ సహా బోధన్‌, అర్బన్‌, ఆర్మూర్‌, బాల్కొండ, రూరల్ నియోజకవర్గాల నుంచి బీఆరెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఓవైపు జాయినింగ్స్‌ కు గేట్లు తెరిచిన కాంగ్రెస్‌ మరోవైపు మాటల దాడులు పెంచింది. అర్వింద్‌ను, బీజేపీ పార్టీ సిద్దాంతాలను కడిగిపారేస్తున్నది. ఇప్పటికే అర్వింద్‌పై వ్యక్తిగతంగా వ్యతిరేకత బాగా పెరిగింది. దీనికి తోడు అతని వైఫల్యాలు, లోపాలను ఎత్తి చూపడంలో కాంగ్రెస్‌ సక్సెస్‌ అవుతోంది. డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి ఇవాళ ఏకంగా అర్వింద్‌ను బట్టలిప్పి కొడతామని హెచ్చరించడం రాజకీయంగా కలకలం రేపింది. కాంగ్రెస్‌ లేకపోతే నీ పుట్టుకకే చరిత్రలేదన్నాడు.

 

You missed