దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా… అసలే కష్టాల్లో ఉన్న బీఆరెస్‌పై మోడీ దాడి మొదలైంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఆ పార్టీని మరింత కిష్ట పరిస్థితులకు నెట్టేసేందుకు లిక్కర్‌ స్కాంను ఇక చివరి అస్త్రంగా ప్రయోగించనున్నాడు. ఇందులో భాగంగా కవితకు సీబీఐ నోటీసులు పంపారు. ఈనెల 26న హాజరుకావాలని ఆ నోటీసులో సీబీఐ పేర్కొన్నది. గతంలో కూడా ఓసారి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకుని పోయిన సీబీఐ .. దీన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు చాలా రోజుల తరువాత మళ్లీ లిక్కర్ స్కాంను బయటకు తీసింది. ఈడీకి హాజరుకాలేనని, ఇది సుప్రీం పరిధిలో ఉందని జవాబు చెబుతూ తప్పించుకుంటూ వచ్చిన కవితకు ఇప్పుడు అలా చేయడం సాధ్యపడదు. కచ్చితంగా హాజరుకావాల్సిన పరిస్థితులే ఉంటాయి. అలా జరిగితే ఆమె అరెస్టుకు కూడా అవకాశం లేకపోలేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆరెస్‌తో పాటు అన్ని పార్టీల్లోనూ ఇదే చర్చ.

బీఆరెస్‌తో పొత్తు మరక పోగొట్టుకునేందుకు…

పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ ఈ లిక్కర్ స్కాం ఒక అద్బుత అవకాశంగా తీసుకుంటున్నది. చాలా రోజులుగా బీఆరెస్‌, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం.. పొత్తుల వ్యవహారం చర్చలో ఉన్నదే. ఇటు బీఆరెస్‌, అటు బీజేపీ శ్రేణులు ఎవరూ కూడా దీన్ని కొట్టిపారేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇది బీజేపీకి నష్టం చేకూర్చేలా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ గ్రాఫ్‌ను పడిపోయేలా చేసిన కారణాల్లో కవితను అరెస్టు చేయకపోవడమే ప్రధానమనే భావనకు వచ్చింది బీజేపీ అధిష్టానం. అసెంబ్లీలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న బీఆరెస్‌తో ఇప్పుడు బీజేపీకి పనిలేదు. పైగా పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు కలిసి పనిచేస్తాయనే ప్రచారం ఊపందుకున్నది. ఇది బీఆరెస్‌కు కలిసి వస్తుందేమో గానీ, బీజేపీని నష్టపరిచేదే. దీంతో ఈ లిక్కర్‌ స్కాంను మరోసారి ఇలా తెరపైకి తీసింది కేంద్రం.

కవిత అరెస్టుతో బీజేపీ గ్రాఫ్‌ పెరిగేనా..?

ఇప్పటికే మోడీ మానియా జోరందుకున్నది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఈ ప్రభావం బాగానే పడేలా ఉంది. లిక్కర్‌ స్కాంలో కవిత అరెస్టు చేస్తే బీఆరెస్‌కు సింపతీ ఈసమయంలో రాదని కేంద్రం భావిస్తోంది. ఇది మరింతగా తమ పార్టీకి మైలేజీ ఇచ్చే అంశంగానే భావిస్తోంది. దీంతో కవిత అరెస్టుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కవితను అరెస్టు చేయడం వల్ల బీజేపీ మంచి పనిచేసేందనే భావన ప్రజల్లో వస్తుందనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉంది. అందుకే సీబీఐని రంగంలోకి దింపి కార్యం చక్కబెట్టేలా తెరవెనుక మోడీ పావులు కదుపుతున్నాడని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

ఇద్దరి పోరును ఆసక్తిగా గమనిస్తున్న కాంగ్రెస్‌..

పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ, బీఆరెస్‌ల మధ్య ఉన్న స్నేహబంధాన్ని కాంగ్రెస్‌ ఆసక్తిగా గమనిస్తుంది. పరిణామాలేవైనా అది తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నది. కవితను అరెస్టు చేసినా.. చేయకపోయినా.. లిక్కర్‌ స్కాం ఇష్యూ రిజల్టును తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజల వద్ద ఈ రెండు పార్టీలను దోషిలా నిలపాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. కవిత అరెస్టు తరువాత ఇదే అదనుగా భావించి బీఆరెస్‌ నుంచి భారీ ఎత్తున వలసలను ఆహ్వానించాలని కాంగ్రెస్‌ డిసైడ్‌ అయ్యింది.

You missed