దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి:

సిట్టింగులుగా పదేళ్లుగా చేసిన అరాచకాలు, వారినే సమర్థిస్తూ కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు.. ఇప్పుడు బీఆరెస్‌కు శాపంలా మారాయి. ఎమ్మెల్యేలుగా సిట్టింగులు చేసిన దౌర్జన్యాలు, పార్టీకి పూర్తిగా నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించడమే కాకుండా కేసీఆర్‌ వారినే సుప్రీం అనడం, ముచ్చటగా మూడోసారి కూడా టికెట్‌ ఇచ్చి నెత్తిన పెట్టుకోవడం చాలా మందికి నచ్చలే. కానీ కేసీఆర్‌ ఎవరి మాటా వినలే. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యేలే ఇప్పటికీ పార్టీలో పెత్తనం వహిస్తుంటే ఇక చూస్తూ ఊరుకోలేకపోతున్నారు చాలా మంది సీనియర్లు. అందుకే బీఆరెస్‌కు గుడ్ బై చెబుతున్నారు.

తాజాగా ఈ లిస్టులో ఆర్మూర్‌ నియోజకవర్గం అంకాపూర్‌ గ్రామానికి చెందిన సీనియర్‌ లీడర్‌, మార్క్‌ ఫెడ్ చైర్మన్‌ మార గంగారెడ్డి చేరారు. ఆయన బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిలతో సంప్రదింపులు జరిపారు. పార్టీలో చేరడం దాదాపు ఖరారయ్యింది. ఈ రెండు మూడు రోజుల్లో చేరికక ముహూర్తం కూడా కుదిరింది. ప్రధానంగా మార ఆరోపిస్తున్నవాటిల్లో ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దాష్టీకాలే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మూడు సార్లు జీవన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడం వల్ల పార్టీ పూర్తిగా నష్టపోయిందని, ఎంతో కష్టపడి పార్టీని నిర్మించుకుంటే దాన్ని పూర్తిగా జీవన్‌రెడ్డి నేలమట్టం చేశాడని ఆరోపిస్తున్నాడు మార గంగారెడ్డి. ఇలాంటి నేతకు తీసుకెళ్లి పార్టీ జిల్లా అధ్యక్షుడిని కూడా చేయడం పార్టీ మరింత భ్రష్టు పట్టించే విషయమని ఆయన తన సన్నిహితులతో చర్చించినట్టు తెలుస్తోంది. జీవన్‌రెడ్డిని చంకనెక్కించుకుని ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్, కేసీఆర్‌లు ఎందుకు అంతగ్రా ప్రయార్టీ ఇస్తున్నారో అర్థంకావడం లేదని కూడా చాలా సందర్బాల్లో తన ఆవేదనను వెళ్లగక్కాడాయన.

ఇంత జరిగినా కూడా ఇప్పటికే అధిష్టానం నిర్ణయాల్లో మార్పు లేదని, అవే పాలసీ పరమైన లోపాలతోనే పార్టీని మరింత దిగజార్చి నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇక చూస్తూ ఆ పార్టీలో కొనసాగేందుకు మనసొప్పడం లేదని ఆయన సన్నిహితులతో వాపోయాడని తెలిసింది. ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్‌ గూటికి పోవాలని నిర్ణయించుకున్నాడు. నేడో రేపో అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఆర్మూర్‌ రాజకీయాల్లో మార ఇక క్రియాశీలకం కానున్నారు. సీనియర్ నేతగా పార్లమెంటు ఎన్నికల్లో మార గంగారెడ్డి సేవలను కాంగ్రెస్‌ పార్టీ వినియోగించుకోనుంది.

 

You missed