శరత్ దెబ్బకు షకీల్ అజ్ఞాతవాసి..
షకీల్‌ను వేటాడి వెంటాడి..
అష్టదిగ్బంధనం చేసిన శరత్‌రెడ్డి..
రైస్‌మిల్లుల బాగోతాలు బట్టబయలు.. కేసు నమోదు చేసే దాకా వదలని వైనం..
మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఏసీపీని బదిలీ చేయించి.. కొడుకు కారు యాక్సిడెంట్ కేసులో షకీల్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి : ఇద్దరి ప్రాణ స్నేహితుల మధ్య ఏర్పడిన శత్రుపోరులో షకీల్ చిత్తు చిత్తుగా ఓడాడు. తూము శరత్‌రెడ్డి దెబ్బకు షకీల్ అజ్ఞాతవాసంలో ఉండిపోయాడు. కొడుకు రాహిల్‌తో కలిసి పోలీసుల కళ్లుగప్పి దుబాయ్‌లో దాక్కున్నాడు. బోధన్‌కే కాదు హైదరాబాద్‌కూ అడుగు పెట్టే పరిస్థితి లేకుండా లుకవుట్ నోటీసులు ఇప్పించేలా చేశాడు శరత్. ఇక్కడ బోధన్‌లో షకీల్ ఏర్పర్చుకున్న సామ్రాజ్యాన్ని మొత్తం కుప్పకూల్చాడు. బోధన్ మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఏసీపీకి కూడా బదిలీ చేయించాడు శరత్ రెడ్డి. ఇక రైస్‌మిల్లుల వ్యాపారంలో పెద్ద కుంభకోణానికి తెరలేపిన షకీల్‌ను వెంటాడాడు. అధికారులకు మొత్తం సమాచారమిచ్చాడు.
ఆమ్యామ్యాలకు అలవాటు పడి అప్పటి వరకు తమాషా చూస్తూ కూర్చున్న అధికారుల్లో కదలిక వచ్చింది. కలెక్టర్ సీరియస్ ఆదేశాలు జారీ చేసే పరిస్తితి తెచ్చాడు శరత్. దీంతో రంగంలోకి దిగిన సివిల్ సప్లై టీమ్ మొత్తం బాగోతం బయటకు తీసింది. కోట్లలో సీఎంఆర్ అమ్మేసుకుని ప్రభుత్వానికి భారీ నష్టాన్ని తెచ్చిన వైనం వెలుగు చూసింది. దీంతో షకీల్‌పై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఒక్కొక్కటిగా షకీల్ కోరల్ని మొత్తం పీకేసుకుంటూ వచ్చాడు శరత్‌రెడ్డి. అప్పడు అతనో అజ్జాతవాసి. శరత్‌రెడ్డి బోధన్‌లో షాడో ఎమ్మెల్యే. రెండు నెలల వ్యవధిలోనే బోధన్ కథ తారుమారయ్యింది. శపథం చేసి శరత్‌రెడ్డి గెలిచి నిలిచాడు. తాడో పేడో చూసుకుందామని తొడలు చరిచిన షకీల్ కనిపించకుండా వాంటెడ్ లిస్టులో చేరాడు.