దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:

ఇందూరు మొన్నటి వరకు బీఆరెస్‌కు కంచుకోట. ఇప్పుడా కోటకు బీటలు వారాయి. పరిస్థితులు పూర్తిగా తారుమారాయ్యాయి. ఇప్పుడు ఇందూరు రాజకీయాలపై మహేశ్‌ ముద్ర పడనుంది. మొన్నటి వరకు కవిత ఏలిన ఈ నేలను మహేశ్‌ గౌడ్‌ వశం చేసుకోనున్నాడు. రాజకీయాలు రంజుగా మారనున్నాయి. గురువారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నడుమ ఇందూరు నగరంలో కాంగ్రెస్‌ తన హవా చాటుకోనున్నది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు ఎమ్మెల్సీ పదవి వరించడం, ఇక్కడ అర్బన్‌ నుంచి పోటీ చేసిన షబ్బీర్‌ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవి వరించిన తరువాత మొట్ట మొదటి సారిగా జిల్లాకు వస్తున్న సందర్బంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికిందుకు భారీ ఏర్పాట్లు చేసింది.

బోర్గాం నుంచి భారీ ర్యాలీ నడుమ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు , నాయకులు షబ్బీర్‌కు, మహేశ్‌కు స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రగతినగర్‌లోని మున్నూరుకాపు కళ్యాణమండపంలో జరిగే సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది జిల్లా పార్టీ. ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాలో తొలిసారిగా జరిగే కార్యక్రమం కావడంతో దీన్ని సక్సెస్‌ చేయాలని అంతా భావిస్తున్నారు. నగరంలో అంతటా ఫ్లెక్సీలు వెలిశాయి. ఎక్కడ చూసినా కాంగ్రెస్‌ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇది జరగడానికి సరిగ్గా ఒక్కరోజు ముందే అర్బన్‌ నుంచి బీఆరెస్‌ కీలక నేతలంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరడం.. హస్తం పార్టీకి మరింత ఊపును, బలాన్ని తెచ్చిపెట్టగా.. బీఆరెస్‌ను మరింత డీలా పరిచి నీరుగార్చేలా చేసింది.

You missed