దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి: తనకు మళ్లీ నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వొద్దని కార్యకర్తలతో ఆత్మహత్యలకు పాల్పడే డ్రామాకు ఎమ్మెల్సీ కవితదే డైరెక్షన్‌ అని ఎంపీ అర్వింద్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఇదంతా ఆమె ప్లానే అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం ఆర్మూర్‌లో ఆయన బీజేపీ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తనకు టికెట్‌ ఇవ్వొద్దంటూ బీజేపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునే అంశాన్ని విలేకరులు లేవనెత్తగా ఇది ఎమ్మెల్సీ కవిత ప్లాన్‌ అని ఆరోపించడం కలకలం రేపింది.

పార్టీలో ఇతర నేతలు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు కదా అని పరోక్షంగా యెండల లక్ష్మీనారాయణ, అల్జాపూర్‌ శ్రీనివాస్‌ తదితరుల పేర్లను విలేకరులు ప్రస్తావించగా.. ‘ పార్టీలో చాలా మందే టికెట్లు అడుగుతారు. కానీ ఆ అడిగిన వారి అభ్యర్థిత్వాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారో కూడా చూడాలి కదా’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. తనకు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని స్పష్టం చేశాడు. తనకు తప్ప ఎవరిని అడిగినా వారికి అంత సీన్ లేదనే విధంగా అర్వింద్‌ కామెంట్‌ చేయడం పట్ల పార్టీలో కొంత సీనియర్లు నొచ్చుకున్నారు. అర్వింద్‌ కామెంట్లపై పార్టీ సీనియర్ల నుంచి కౌంటర్ వచ్చే అవకాశాలూ లేకపోలేదు.

మరోవైపు అర్వింద్‌ తననే ఎంపీ టికెట్ అధిష్టానం ఓకే చేసిందనే విధంగా ఆర్మూర్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకుని తనకు తానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్న చందంగా వ్యవహరించడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. పార్లమెంటు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో బీజేపీలో నేతల మధ్య ఉన్న విభేదాలు బయటకు వస్తున్నాయి.

You missed