దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
మీరు మారాలన్నాడు రాకేశ్‌రెడ్డి. మేమింతేనన్నాడు సుదర్శన్‌రెడ్డి. ఇదేందీ… నా నియోజకవర్గంలో మీ పెత్తనం అన్నాడు రాకేశ్. అవును ఇద్దరు కలిసి పనిచేసుకోండ్రి.. మావోడిని కలుపుకుని పో.. అని ఉచిత సలహా పడేశాడు సుదర్శన్ రెడ్డి. నీనెందుకు కలుపుకోవాలి.. నేనా ఎమ్మెల్యే.. వినయ్‌రెడ్డా..? నిలదీశాడు రాకేశ్‌రెడ్డి. ఎమ్మెల్యే నువ్వైనా సర్కార్ మాదే మరిచిపోకు…. హితబోధ చేశాడు సుదర్శన్‌రెడ్డి. నేను మారనంతే అన్నాడు రాకేశ్‌రెడ్డి. మేము కూడా ఇంతే. మారమంతే.. తెగేసి చెప్పాడు సుదర్శన్‌రెడ్డి. ఈ సంభాషణంతా జరిగింది అసెంబ్లీ లాబీలో. గురువారం నాడు అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఇలా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఇదంతా. మధ్యలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నాడండోయ్. ఆయన అలా నోరప్పగించి చూస్తూండిపోయాడు ఇద్దరి వాదనలతో బుర్ర వేడెక్కుతున్న ఫీలింగుతో. ఇంకా ఒడవలే వారిద్దరి వాదనలు.. వాగ్వాదాలు.
‘అవునూ.. మా సీఎం రేవంత్‌ను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నవంట.. జర నోరు అదుపులో పెట్టుకో..!’ అన్నాడు సుదర్శన్‌రెడ్డి. ‘ నాకు వ్యక్తిగతంగా ఆయన్ను దూషించే ఉద్దేశం లేదు. పాలసీ పరమైర మ్యాటర్‌మీదే మాట్లాడుతున్నా..!’ అదే రేంజ్‌లో సమాధానమిచ్చాడు రాకేశ్‌రెడ్డి. ‘ ఏందయ్యా.. మాట్లాడితే మామీద పడుతున్నవ్.. కొత్త ఎమ్మెల్యేవు.. అంత ఆవేశం ఎందుకు..?’ సముదాయించే ప్రయత్నం చేశాడు సుదర్శనుడు. ‘మీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు… నేనేంటో చూపిస్తా..!’ కయ్యానికి కాలు దువ్వాడు రాకేశుడు. ‘ చూస్కుందామా…? సరే అయితే చూస్కుందాం..!’ అన్నాడు చిర్రెత్తుకొచ్చిన సుదర్శనుడు. వీరి వీరావేశాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయని గ్రహించిన మధ్యలో ఉన్న జూపల్లి ‘కూల్.. కూల్ రాకీ.. నేను చెప్తాలే.. అంతా సర్దుకుంటుందిగా..! అని రాకేశుడి రంకెలకు బ్రేకులు వేశాడు. ఇదీ జరిగింది. ఆర్మూర్ రచ్చ రాజకీయం ఇలా మరోసారి అసెంబ్లీ లాబీలో సుదర్శనుడికి రాకేశుడికి మధ్య మరింత గ్యాప్ ను పెంచింది. నారదమునిలా ఇద్దరి మధ్య పుల్ల పెట్టిన వినయ్‌రెడ్డి మాత్రం నియోజకవర్గంలో కూల్‌గా తన పనితాను కానిచ్చేసుకుంటున్నాడు.