దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
జహీరాబాద్ బీఆరెస్ ఎంపీ టికెట్ ఈసారి పోచారం భాస్కర్‌రెడ్డికి ఇవ్వాలని పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్‌పై పార్టీలో సదాభిప్రాయం లేదని, అతనికి ఈసారి ఇవ్వొద్దనే వాదనలూ వినిపిస్తున్నాయ. భాస్కర్‌రెడ్డికి జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే యూత్ మొత్తం పార్టీకి సపోర్టుగా పనిచేస అవకాశం ఉందనే సంకేతాలు సోషల్ మీడియా ముఖంగా అధిష్టానానికి సంకేతాలిస్తున్నారు. కాగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా తెరవెనుక పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌తో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. తన తనయుడికి డీసీసీబీ చైర్మన్ చేసుకోవడంలో సఫలీకృతులయ్యాడు.
తన రాజకీయ వారసుడిగా బాన్సువాడ ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేశాడు పోచారం. కానీ సిట్టింగులకే ఈసారి చాన్స్ అనే నినాదంతో కేసీఆర్ ముందుకు పోవడంతో తన ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ ఓటమి పాలైన ప్రస్తుత నేపథ్యంలో ఈసారి అవకాశాన్ని తీసుకుని ఎంపీగా తన తనయుడిని చూడాలనే ఆకాంక్ష పోచారం శ్రీనివాస్‌రెడ్డిలో బలోపేతం అవుతూ వస్తోంది. పార్లమెంటు నియోజకవర్గ మీటింగులో కూడా తన వాయిస్‌ను తన అనుచరులు, పార్టీ క్యాడర్ ద్వారా అధిష్టానానికి వినిపించాడు పోచారం. ఇప్పుడు టికెట్ కోసం ప్రయత్నం మరింత ముమ్మరం చేస్తున్నాడు. ఎలాగైన తన తనయుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడం ద్వారా తన రాజకీయ వారసుడిగా ఎలివేట్ చేసినట్టవుతుందని, భవిష్యత్తు రాజకీయాలకు ఇది ఇతోధికంగా పనిచేస్తుందని సీనియర్ లీడర్ పోచారం భావిస్తున్నాడు. ఆ దిశగానే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.