దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

మహాలక్ష్మీ పథకంలో మరో ముందడుగు పడింది. 500కే గ్యాస్‌ సిలిండర్‌ను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో ఓ మెలిక పెట్టింది. రేషన్‌ కార్డున్నవారికి మాత్రమే ఐదొందల గ్యాస్‌ దక్కనుంది. మరి లేని వారి పరిస్థితి ఏమిటంటారా.. ? వారి సంగతి తరువాత చూస్తామని తప్పించుకునే దోరణి అవలంభిస్తున్నది సర్కార్‌. వాస్తవానికి రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఎంక్వైరీ చేసి వాటిని మంజూరి చేసిన తరువాత ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి. కానీ అలా చేస్తే భారం మరింత తడిచి మోపెడవుతుందని సర్కార్‌ భయపడుతోంది. దీంతో గత సర్కార్‌ ఇష్యూ చేసిన రేషన్‌కార్డుదారులకే ఈ స్కీములు అమలు చేయాలని చూస్తున్నది. మరి రాని వారి పరిస్తితి ఏమిటీ..? కార్డులు లేనివారికివ్వరా..? అంటే.. తరువాత వాటిపై పరిశీలన చేస్తామని ప్రస్తుతానికి వీటిని పెండింగ్‌లో పెట్టేసింది.

కాగా ఐదొందలకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చే ఈ స్కీమ్‌ కోసం మరోసారి అధికారులను రంగంలోకి దింపనుంది సర్కార్‌. గురవారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు అధికారులు ఇంటింటి సర్వే చేయనున్నారు. గ్యాస్‌ నెంబర్, గ్యాస్‌ కంపెనీ పేరు, రేషన్‌ కార్డు నెంబర్‌ను నోట్‌ చేసుకుని ప్రభుత్వానికి సమర్పిస్తారు. దీని కోసం ప్రత్యేక యాప్‌ను తయారు చేశారు. వీటిలో ఆ వివరాలు పొందుపరిచి సర్కార్‌కు పంపుతారు. ప్రభుత్వం దీన్ని లాంచ్ చేయగానే ఈ పథకం అమలు జరగనుంది. అయితే సబ్సిడీ మొత్తాన్ని ఖాతాలో వేస్తారా..? అనే అనుమానాలున్నాయి. కానీ ఐదొందలు చెల్లించి నేరుగా గ్యాస్‌ తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఆరు గ్యారెంటీల దరఖాస్తుల్లో ఖాతా నెంబర్‌ను స్వీకరించలేదు. ఐదొందలు పోను మిగిలిన మొత్తాన్ని గ్యాస్‌ కంపెనీలకు ప్రభుత్వమే ముందస్తుగా జమ చేస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

You missed